పండగ పూటా పస్తులే!

20 Oct, 2014 03:14 IST|Sakshi

తిరుపతి రూరల్:  ప్రభుత్వ నిర్ణయాలు పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పింఛన్ పెరిగిందని ఆనందించిన అసహాయులకు అదీ అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూన్న జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి జనం ఉండరని జిల్లాలో పింఛన్ల పంపిణీని శనివారం అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా వేలాదిమంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, అభయహస్తం పింఛన్‌దారులు పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి. వీరందరికీ జన్మభూమి ప్రారంభం తర్వాతే పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
 
ఇస్తూ.. ఇస్తూ..

జిల్లాలో సెప్టెంబర్ వరకు దాదాపు నాలుగు లక్షలకు పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అనర్హుల ఏరివేత పేరుతో టీడీపీ నేతల కనుసన్నల్లో చే పట్టిన సర్వేలో పింఛన్ల జాబితా నుంచి 84,617 మందిని ఇప్పటికే తొలగించారు. వీరికి అక్టోబర్ నుంచి పింఛన్లు నిలిపివేశారు. మిగిలిన వారికి ఐదు రెట్లు పింఛన్ పెంచాం అంటూ జన్మభూమి కార్యక్రమంలో అందించారు. కొన్ని పంచాయతీల్లో జన్మభూమి ఆలస్యం కావడంతో పింఛన్ కోసం లబ్ధిదారులు ఆధికార పార్టీ నేతలను నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో జన్మభూమితో పనిలేకుండా మూడు రోజులుగా పింఛన్లు అందిస్తున్నారు. కాని ఈ నెల 25 నుంచి మళ్లీ జన్మభూమి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. అందరికీ పింఛన్లు అందిస్తే సభలకు జనంరారనే అనుమానం అధికార పార్టీ నేతలకు వచ్చింది. అనుకున్నదే తడవుగా పింఛన్ల పంపిణీ నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శనివారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని పోస్టుమాస్టర్లు నిలిపివేశారు.
 
అభాగ్యుల ఆవేదన

పెరిగిన పింఛన్ చేతికి వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభాగ్యులకు ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటుగా మారింది. పింఛన్‌కు, జన్మభూమికీ లింకు పెడుతూ దానిని అందకుండా చేస్తుండడంతో  మండిపడుతున్నారు. దీపావళికి ఇంట్లో పింఛన్ వెలుగులు వస్తాయని కొందరు, అనారోగ్యానికి అక్కరకు వస్తుందని మరికొందరు ఆశించినా వారికి నిరాశే మిగిలింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకే..
 జన్మభూమి ఉన్న రోజునే పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందువలన పింఛన్ల పంపిణీ ఆపేశాం. తిరిగి జన్మభూమి జరిగే రోజు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తాం.
- ఏపీడీ.శర్మ, పోస్టల్ సూపరింటెండెంట్, తిరుపతి
 

మరిన్ని వార్తలు