వణుకుతున్న తోటపాలెం

5 Jul, 2018 11:59 IST|Sakshi
దోమల నివారణకు తోటపాలెం తీసుకువచ్చిన పిచికారీ మందులు 

ప్రబలిన విషజ్వరాలు

చర్యలకు ఉపక్రమించిన మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖలు

వారం రోజుల పాటు నివారణ చర్యలకు ప్రణాళిక

విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు తోటపాలెంలో విష జ్వరాలు ప్రబలాయి. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో డెంగీ వ్యాధి సోకినట్లు వచ్చిన ఉదంతంపై చర్యలు తీసుకున్నా  పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం.. దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడం....

తదితర సమస్యలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ జ్వరపీడుతుల సంఖ్య తగ్గకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, పీడిస్తున్న జ్వరాలపై మున్సిపల్‌ యంత్రాంగానికి  ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీంతో స్పందించిన కమిషనర్‌  టి.వేణుగోపాలరావు ఆ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఎంహెచ్‌ఓ డాక్టర్‌ శివకుమార్‌తో పలువురు సిబ్బందిని పంపించారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తమ వంతు చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. 

 స్వలాభం కోసం చూసుకోకండి...

పట్టణంలోని తోటపాలెం ప్రాంతంలో ప్రబలుతున్న విషజ్వరాలపై ఎంహెచ్‌ఓ డాక్టర్‌ శివకుమార్‌  ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రోహితకు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుందీ.. తీసుకున్న వైద్యంపై ఆరా తీశారు.. స్థానికంగా  ఉన్న ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నామని చెప్పడంతో స్పందించిన ఎంహెచ్‌ఓ ఆర్‌ఎంపీ నిర్వహిస్తున్న చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు.

రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు జ్వరంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్‌ చేయాలని సూచించారు. స్వలాభం కోసం చూసుకుని రోజుల తరబడి వైద్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పారు. తోటపాలెంలో జ్వరాల తగ్గుముఖం పట్టేందుకు వారం రోజుల  ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

ఇందులో భాగంగా రెండు ఫాగింగ్‌ మిషన్లతో ఫాగింగ్‌ చేయడంతో పాటు మొబైల్‌ మలేరియా, డెంగీ క్లినిక్‌ సహాయంతో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.


 

మరిన్ని వార్తలు