వణుకుతున్న అన్నంరాజుపేట

31 Jul, 2018 13:15 IST|Sakshi
జ్వరంతో బాధపడుతున్న నలుగురు కుటుంబ సభ్యులు 

ఎస్సీ కాలనీలో ఇంటింటా జ్వరపీడితులు

జ్వరం, పచ్చకామెర్లతో ఒకరి మృతి

ఆందోళనలో గ్రామస్తులు

జామి విజయనగరం : మండలంలోని అన్నంరాజుపేటలో జ్వరాలు ప్రబలాయి. ప్రతి ఇంటికీ ఒకరిద్దరు జ్వరపీడితులున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికీ ఇద్దరు, ముగ్గురు మంచానపడ్డారు. గ్రామానికి చెందిన కొంతమంది ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీయగా, మరికొంతమంది విజయనగరం కేంద్రాస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, తదితర సమస్యలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.

ఎస్సీ కాలనిలో సుమారు 50 మందికి పైగా జ్వరాలతో భాదపడుతున్నారు. ఇదిలా ఉంటే కాలనీకి చెందిన అలమండ బంగార్రాజు జ్వరం, పచ్చకామెర్లతో సోమవారం మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో బంగార్రాజు అలమండ పీహెచ్‌సీలో వైద్యం పొందాడు. అక్కడ నుంచి విజయనగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో అనంతరం కేంద్రాస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ,ఇద్దరు చిన్నారులు రేవంత్‌(5), హరీష్‌(4)ఉన్నారు. 

ఆందోళనలో కాలనీవాసులు

పారిశుద్ద్యం క్షీణించడం వల్లే జ్వరాలు ప్రబలా యని కాలనీ వాసులు చెబుతున్నారు. కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని అంబేడ్కర్‌ యువజన సంఘ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై ఏఆర్‌ పేట వైద్యాధికారి తూర్పాటి వెంకటరావు మాట్లాడుతూ, కాలనీకి చెందిన బంగార్రాజు అలమండ పీహెచ్‌సీకి రాగా విజయనగరం ఆస్పత్రికి రిఫర్‌ చేశామన్నారు.

అక్కడ పచ్చకామెర్లకు చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. పీహెచ్‌సీ పరిధిలోని ఆరు గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. అలాగే పారిశుద్ధ్యం, క్లోరినేషన్‌ విషయమై ఈఓపీఆర్‌డీ ఏవీ లక్ష్మి వద్ద ప్రస్తావించగా, తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపడతామని చెప్పారు.

పాతబగ్గాంలో డెంగీ..

గజపతినగరం/ విజయనగరం ఫోర్ట్‌ : గజపతినగరం మండలం పాతబగ్గాం పంచాయతీ ఎరుకలపేటలో పాలవలస మోహన్‌ (13) డెంగీ లక్షణాలతో విజయనగరం కేంద్రాస్పత్రిలో సోమవారం చేరాడు. అలాగే గ్రామానికి చెందిన దాసరి సింహాచలం, హర్ష, కిరణ్, తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు.

మోహన్‌కు ప్లేట్‌లెట్స్‌ తగ్గినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు పాలవలస రమణ, పైడితల్లి తెలిపారు. విషయం తెలుసుకున్న మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి జయశ్రీ గ్రామంలో సోమవారం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి మాత్రమే జ్వరాలు ఉన్నట్టు వైద్యాధికారిణి తెలిపారు.

గుమ్మిడివరంలో ప్రబలిన జ్వరాలు

సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట పంచాయతీ గుమ్మిడివరంలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోటు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దోమలు వృద్ధి చెంది జ్వరాలు ప్రబలాయని చెబుతున్నారు. గ్రామానికి చెందిన జి. లీలావతి, పి. వనజాక్షి, కె. గౌరమ్మ, తదితర 30 మంది జ్వరాలతో బాధపడుతున్నారు.

విషయం తెలుసుకున్న వైద్యసిబ్బంది డీవీ సత్యనారాయణ, ఆర్‌. స్వర్ణ, ఆశ వర్కర్‌ పి. లక్ష్మి, తదితరులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో కాలువలు సగం వరకు నిర్మించి వదిలేయడంతో ఎప్పుడు వర్షాలు పడినా పరిస్థితి అధ్వానంగా మారుతుందని జి. కృష్ణరాజు, తదితరులు తెలిపారు.

  కిటకిటలాడిన కేంద్రాస్పత్రి ..1200కు పైగా వచ్చిన రోగులు  

విజయనగరం ఫోర్ట్‌: జిల్లా కేంద్రాస్పత్రికి సోమవారం రోగులు పోటెత్తారు. అన్ని ఓపీలకు రోగులు అధిక సంఖ్యలో వచ్చారు. మానసిక, దంత విభాగాలు మినహాయించి ప్రతీ ఓపీ విభాగానికి 100కు పైగా రోగులు వచ్చారు. దీంతో వైద్యులు రోగులకు వైద్యసేవలందించడానికి అవస్థలు పడ్డారు. ఓపీ చీటీలు ఇచ్చే విభాగం, ఫార్మసీ ఇలా అన్ని విభాగాలు  రోగులతో నిండిపోయాయి.  

మరిన్ని వార్తలు