అదిగదిగో చేప..!

23 Sep, 2019 06:54 IST|Sakshi

చేపలు దొరికే ప్రాంతాలు, సరిహద్దుల సమాచారం కోసం ప్రత్యేక యాప్‌  

కాకినాడ జగన్నాధపురానికి చెందిన 47 ఏళ్ల ఎన్‌.బాబులు చేపల వేటకు వెళ్లి రెండు రోజులైంది. 170 లీటర్ల డీజిల్‌ ఖర్చయిపోయింది. ఎక్కడా చేపలు దొరకలేదు. ఎక్కడో దారి తప్పామని భావించాడు. శ్రీలంక సరిహద్దు రేఖ దగ్గరకు వచ్చినట్లు భావించి తన మిత్రుడికి ఎస్‌ఎంఎస్‌ పంపాడు. సముద్రంలోని ఏ ప్రాంతంలో చేపలు దొరుకుతున్నాయో ఎఫ్‌ఎఫ్‌ఎంఏ యాప్‌లో చూసి కబురు పంపాడు. ఆయన  ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆవైపు వెళ్లి వేట సాగించి చేపలు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కొని ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. వేటకు బయలుదేరబోయే ముందు ఏవైపు వెళ్లాలో నిర్ణయించుకుని సమయాన్ని, ఆయిల్‌ను ఆదా చేసుకుంటున్నాడు. 

సాక్షి, అమరావతి : ఒకప్పుడు అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతున్న రోజులివి. చేపల వేటేమిటీ? యాప్‌ అప్రమత్తం చేయడమేమిటని విస్తుపోకండి. ఎఫ్‌ఎఫ్‌ఎంఏ యాప్‌ ఉంటే సముద్ర సమాచారం మూడొంతులు అరచేతిలో ఉన్నట్టే. 2004 డిసెంబర్‌ 26న సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగి వచ్చిన సునామీతో జాలర్లు సహా ఎంతో మంది చనిపోయారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా వచ్చిన ఆ ఉపద్రవం వందలాది మందిని మింగేసింది. ఈ నేపథ్యంలో ప్రాణాలు అరచేత పట్టుకుని సముద్ర గర్భంలో చేపల వేటకు వెళ్లే వారి ఉపయోగార్ధం డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ రిసెర్చ్‌  ఫౌండేషన్‌ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌),  క్వాల్కామ్, టీసీఎస్, ఇన్‌కాయిస్‌ సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. ఇది ఇంగ్లిషుతో పాటు తెలుగు, తమిళం, మళయాళం, ఒడియా, బంగ్లా, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఉంది. చేపల వేటతో పాటు సముద్ర ఆటుపోట్ల సమాచారాన్ని అందిస్తుంది. ప్రమాదకరమైన ప్రాంతాలు, పడవలు మునిగే ప్రమాదం ఉన్న ప్రదేశాలు, గతంలో ప్రమాదం జరిగిన స్థలాల సమా చారాన్ని అందిస్తుంది. ఏవైపు వెళితే చేపలు దొరుకుతాయో రేఖాంశాలు, అక్షాంశాలతో సహా చూపిస్తుంది.    

ఎన్నెన్నో ఉపయోగాలు 

  • వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం, అలల ఎత్తు, గాలి వేగం, అలల దిశ, సముద్ర ఉపరితల వాతావరణం రాబోయే 48 గంటల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అందిస్తుంది. 
  • గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌), దిక్సూచి (కంపాస్‌), హార్బర్‌ను గుర్తించే విధానం (హార్బర్‌ నావిగేషన్‌), మై ట్రాకర్‌ (తనను గుర్తించే విధానం), సంప్రదాయ చేపలు, ట్యూనా చేపలు దొరికే ప్రాంతాలు, వేట సాగించాల్సిన మార్గం ఉంటాయి. మొబైల్‌ ఫోన్‌కు ఇంటర్‌నెట్‌ లేకున్నా జీపీఎస్, నావి గేషన్‌లోని సౌకర్యాలను పొందవచ్చు. 
  • ప్రధాన హార్బర్లలో చేపల ధరల వివరాలు, సముద్రంలో అత్యవసర సాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, ఎస్‌ఓఎస్‌ (మమ్మల్ని కాపాడండి) పంపే సౌలభ్యం, ప్రభుత్వం తెలిపే నిర్ధిష్ట  సమాచారం, ఉద్యోగ అవకాశాలు, శిక్షణ, మత్స్యకారులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, రాయితీలు వంటి సమాచారం పొందవచ్చు.  
  • ఎఫ్‌ఎఫ్‌ఎంఏ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగులో ఇతరత్రా సమాచారం కోసం డాక్టర్‌ ఎన్‌. వీరభద్రరావు (9866049073)ను ఫోన్‌లో సంప్రదించవచ్చు.  

ఇన్‌కాయిస్‌ పాత్ర కీలకం 
సముద్ర సమాచార సేవలకు సంబంధించి భారత జాతీయ కేంద్రం (ఇన్‌కాయిస్‌) ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు సముద్రానికి సంబంధించిన ఆ సమాచారాన్ని అందిస్తుంది. స్వామినాథన్‌ ఫౌండేషన్‌ వారు ఈ సమాచారాన్ని అప్‌లోడ్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ సమాచారం 148 కిలోమీటర్ల వరకు చేరుతోంది. దీన్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టు స్వామినాథన్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు డాక్టర్‌ ఎన్‌.వీరభద్రరావు చెప్పారు. ఈ యాప్‌పై తీర ప్రాంతాలలో శిక్షణ ఇస్తున్నట్టు ఈ కార్యక్రమ ముఖ్య సమన్వయాధికారి డాక్టర్‌ ఆర్‌.రామసుబ్రమణ్యం చెప్పారు. పొరపాటున ఎవరైనా అంతర్జాతీయ సముద్ర జలాల రేఖకు చేరువవుతున్నప్పుడు నాలుగు కిలోమీటర్ల ముందే అప్రమత్తం చేస్తుందన్నారు. తుపాను, సునామీ.. ఇతరత్రా ఏదైనా ముప్పు ఉన్నట్టు తెలిస్తే తక్షణమే తిరిగి రావడానికి వీలవుతుంది.  

మరిన్ని వార్తలు