వినోదం బహుభారం

9 May, 2019 12:32 IST|Sakshi
ఏపీ ఫైబర్‌ ప్రసారాలు

నిరాశజనకంగా ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ సేవలు

చెప్పేది రూ.149, వసూలు చేసేది రూ.230

సామాన్యుడికి భారంగా మారిన టీవీ ప్రసారాల బిల్లులు

ఏపీ ఫైబర్‌ సేవలపై ఆసక్తి చూపని వినియోగదారులు

జిల్లాలో కేవలం 26 వేల ఏపీ ఫైబర్‌ కనెక్షన్లు

ఇతర కనెక్షన్లు 2 లక్షలకు పైమాటే..

కంభం : అతి తక్కువ ధరకే మూరుమూల గ్రామాల్లో సైతం టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్‌ సౌకర్యం కల్పిస్తామంటూ టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ పథకం వినియోగదారులకు ఆశించినంత ప్రయోజనకరంగా లేదు. నెలవారీ చార్జీలు రూ.149 కే అని చెప్పినప్పటికీ వినియోగదారుల నుంచి జీఎస్టీ, బాక్స్‌ రెంటల్‌ అంటూ నెలకు రూ. 230  వసూలు చేస్తున్నారు. అది కూడా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు. జిల్లాలో చాలా చోట్ల ఇంకా ఫైబర్‌ కనెక్షన్లు అందుబాటులోకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చినా తీసుకోడానికి ఆసక్తి కనబరచడం లేదు. జిల్లాలో సుమారు 2 నుంచి 3 లక్షల వరకు కేబుల్, ఇతర ప్రవేట్‌ కనెక్షన్లు ఉంటే ఏపీ ఫైబర్‌ కనెక్షన్లు 26 వేలు మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి జిల్లాలో ఏపీ ఫైబర్‌ పై వినియోగదారులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది.

నామమాత్రంగా సేవలు..
ఏపీ ఫైబర్‌ పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయినప్పటికి ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. కొందరు వినియోగదారులు తరచూ సెట్‌టాప్‌ బాక్సులు మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు. టీవీ ఆన్‌ చేసిన ఐదు నిమిషాలకు ప్రోగ్రామ్స్‌ వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫైబర్‌లో నెట్‌ సౌకర్యం, ఫోన్‌ సౌకర్యం ఉన్నప్పటికి వాడాలంటే బయపడిపోతున్నారు. అర్థవీడు మండలంలో ఫోన్‌ వాడిన కొందరు వినియోగదారులకు వేలల్లో బిల్లులు వచ్చినట్లు తెలిసింది. దీంతో వినియోగదారులు నెట్, ఫోన్‌ వాడాలంటేనే బెంబేలెత్తుతున్నారు. నెలనెలా బిల్లులు రాక పోవడంతో బిల్లులు ఎంతొస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇంకా ఫైబర్‌ సేవలు ప్రారంభం కాలేదు. సబ్‌స్టేషన్‌లో ఫైబర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కస్టమర్లకు లైన్లు లాగి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఒక ఓఎల్‌టీలో 120 కనె„ýక్షన్లు ఇవ్వడానికి వీలుపడుతుంది అదనంగా కనెక్షన్లు ఇవ్వాలంటే అదనంగా ఖర్చువస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతా ల్లో కనెక్షన్లు అడిగినా వారు ఇవ్వడం లేదు.

ట్రాయ్‌ నిబంధనలతో అవస్థలు..
గతంలో రూ.150 నుంచి రూ.190 లోపే అన్ని రకాల చానల్స్‌ వినియోగదారులకు అందుబాటులో ఉండేవి. ట్రాయ్‌ రూల్స్‌ వచ్చినప్పటి నుంచి ప్రజలు బిల్లులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. అన్ని చానల్స్‌ చూడాలనుకున్న వారికి నెలకు రూ.320 వరకు ఖర్చు వస్తుంది. తెలుగు చానల్స్‌ బేసిక్‌ ప్లాన్‌తో టీవీలు చూడాలనుకున్న వారికి రూ.250  వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం వినియోగదారులు వారికి కావాల్సిన చానల్స్‌ను ముందుగానే ఎంచుకొని రీచార్చ్‌ చేసుకోవాలి. గతంలో ఈ పరిస్థితి లేదు నెలనెలా బిల్లులు కడితే సరిపోయేది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు రీచార్జ్‌ చేసుకోవాలంటే భయపడిపోతున్నారు.

వినియోగదారులు రీచార్జ్‌చేసుకోవడం లేదు
గతంలో 199 రుపాయలకే అన్ని చానల్స్‌ వచ్చేవి ప్రస్తుతం 280 రుపాయలకు మించి కట్టాల్సి వస్తోంది. దీంతో వినియోగదారులు రీచార్జ్‌ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వినియోగదారులు బిల్లులు కట్టలేమంటూ కనెక్షన్లు మానుకుంటున్నారు.–  మున్నా, కేబుల్‌ నిర్వాహకుడు, కంభం

బిల్లు ప్రతినెలా జనరేట్‌అవుతుంది..
ఏపీ ఫైబర్‌కు సంబం దించి వినియోగదారుల బిల్లు ప్రతినెల జనరేట్‌ అవుతుంది. కేబుల్‌ నిర్వహకులు కనెక్షన్లకు వెళ్లేందుకు ఆలస్యమవుతుందేమో వినియోగదారులు విచారించుకోవాలి. బిల్లులు పెండింగ్‌ లేకుండా  చూసుకోవాలి.– చంద్రశేఖర్,ఏపీ ఫైబర్‌ జిల్లా మేనేజర్‌

మరిన్ని వార్తలు