ఇంటింటికి ఇంటర్నెట్‌ ఎక్కడ..?

12 Dec, 2018 06:57 IST|Sakshi
ఫైబర్‌ గ్రిడ్‌ సర్వర్‌

పేలవంగా ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు

ఇంకా చాలా గ్రామాలకు చేరని కనెక్టవీటీ

డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాలకు సేవలు హుళక్కే..!

విజయనగరం గంటస్తంభం: ఇంటింటికి తక్కువ ధరకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా ప్రజలకు మాత్రం చేరువ కావడం లేదు. అనుకున్న సమయం సమీపిస్తున్నా ఇంకా చాలా గ్రామాలకు కనెక్టవీటీ సౌకర్యమే లేదు. ఇక ఇళ్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు చేరలేదు. దీంతో చాలా కుటుంబాలకు ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు ఇప్పట్లో అందేటట్లు కనిపించడం లేదు. టెక్నాలజీ కోసం ఎక్కువగా మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కేవలం రూ.145 టీవీ, ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌ వినియోగించే విధంగా చేస్తామన్నారు. ఈ మాటలని మూడేళ్లు దాటిపోయింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఫైబర్‌ గ్రిడ్‌ కార్యక్రమం ప్రారంభమైనా జిల్లాలో అన్ని గ్రామాలు, అన్ని ఇళ్లకు మాత్రం సేవలందలేదు.

జిల్లాలో ఇదీ పరిస్థితి
ప్రభుత్వం చెప్పినట్లు ఇంటింటికి ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా కనెక్షను ఇవ్వాల్సి ఉంది. అంటే ఇందుకు ముందు అన్ని మండలాలకు, అక్కడ నుంచి గ్రామాలకు, తద్వారా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలి. ఇందులో భాగంగా ఫైబర్‌ గ్రిడ్‌ సంస్థ అధికారులు జిల్లాలో అన్ని మండలాలకు కనెక్షన్లు మాత్రం ఇవ్వగలిగారు. జిల్లా కేంద్రం విద్యుత్‌ సబ్‌ స్టేషన్లకు కనెక్షన్లు ఇచ్చారు. అక్కడ నుంచి గ్రామాలకు ఇచ్చేందుకు కేబుల్‌ అపరేటర్లను ప్రోత్సహించారు. దీనిలో భాగంగా ఇప్పటికే వారిపై ఒత్తిడి పెంచి సేవలందించేలా చూడాలని కోరారు. కానీ జిల్లాలో అనుకున్న మేరకు సేవలు అందలేదు. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటివరకు 280 పంచాయతీలకు మాత్రమే సేవలందించారు. ఇక ప్రభుత్వపరంగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాలన్నింటికీ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా 95 పంచాయతీలకు మాత్రమే ఇచ్చారు. జిల్లాలో వేలాది పాఠశాలలు ఉండగా 70 స్కూళ్లకు మాత్రమే ఇచ్చారు. 2011 జనాభా లెక్కలు ప్రకారం చూస్తే 5.85 లక్షలు, రేషన్‌కార్డులు ప్రకారం చూస్తే 7.50 లక్షల కుటుంబాలు జిల్లాలో ఉండగా ఇప్పటివరకు 30,700 కనెక్షన్లు ఇచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం డిసెంబర్‌ నాటికి అన్ని ఇళ్లకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 5 శాతం ఇళ్లకు ఇవ్వకపోవడం గమనార్హం.

కనెక్షన్‌కు నిరాసక్తత..
జిల్లాలో ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్‌కు జనం ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కేవలం నెలకు రూ.145కే కనెక్షను ఇస్తామని చెప్పినా ఎవరైనా తీసుకోవాలంటే తడిపిమోపుడవుతుంది. పేరుకు రూ.145 అయినా దానిపై ఏకంగా 18శాతం జీఎస్‌టీ పడుతుంది. అంటే దాదాపుగా 25 అదనంగా పడుతుంది. నెలనెలా పరిస్థితి ఇదైతే కనెక్షను వేసుకునేటప్పుడు మరింత భారం పడుతుంది. గ్రామానికి కనెక్షన్‌ కావాలంటే కేబుల్‌ అపరేటరు విద్యుత్‌ సబ్‌స్టేషను నుంచి ఎంత కేబుల్‌ వైరు కావాలంటే అంత వేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా భారంతో కూడుకున్న పని. వాస్తవానికి వారికి ఇప్పటికే గ్రామాల్లో ఇతర కేబుల్‌ కనెక్షన్లు ఉన్నందున ఫైబర్‌గ్రిడ్‌పై ఆసక్తి చూపడం లేదు. సరే ఏదోలా గ్రామాలకు తీసుకెళ్లినా జనం తీసుకోవడం లేదు. ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్‌ అడిగితే కేబుల్‌ అపరేటర్లు వైరు రూపంలో భారీగా బాదుతున్నారు. దీంతో ఇప్పటికే టీవీకి కనెక్షన్, సెల్‌ఫోన్‌ వినియోగం చేస్తున్నందున కొత్తగా ఈ సేవలు లేకపోయినా ఏమవుతుందన్న దోరణిలో చాలా మంది ఉన్నారు. ఇక నెట్‌ స్పీడ్‌ కూడా తక్కువగా ఉండడంతో సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిని అధిమిస్తే అందరికి ఫైబర్‌ సేవలందేది. కానీ ప్రభుత్వం ధర విషయంలో వెనక్కి తగ్గకపోవడం, కేబుల్‌ అపరేటర్లు, జనం ముందుకు రాకపోవడం, విస్తరించాలన్న ఉద్దేశంతో సంబంధిత అధికారులు పని చేయకపోవడంతో ఇప్పటికైతే అన్ని గ్రామాలకు సేవలందలేదు. మరో ఏడాది లోపల అందుతాయన్న నమ్మకం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

క్రమేపీ విస్తరిస్తాం..
ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్టివిటీని క్రమేపీ జిల్లాలోని అన్ని గ్రామాలకు విస్తరిస్తాం. డిసెంబర్‌ నాటికి ఇవ్వడం సాధ్యం కాదు. ప్రత్యేకంగా లక్ష్యం అంటూ ఏదీ లేదు. దశల వారీగా విస్తరిస్తాం. మార్కెటింగ్‌ అధికారులు కేబుల్‌ ఆపరేటర్లతో మాట్లాడి కనెక్షన్లు ఇస్తాం.– సీతారాం, ఫైబర్‌ గ్రిడ్‌ మేనేజర్‌.

మరిన్ని వార్తలు