గ్రామీణ భారతానికి లండన్ బాబుల ఫిదా

30 Jul, 2014 01:24 IST|Sakshi
గ్రామీణ భారతానికి లండన్ బాబుల ఫిదా

 గత స్మృతుల్లోకి తీసుకువెళ్లి, మనసు పులకింపజేసే శక్తి అందమైన ఒక్క ఛాయా చిత్రానికే ఉంటుంది. వంద మాటలు చెప్పలేని భావాన్ని ఒక ఫొటో సులువుగా తెలియజేస్తుంది. మదిని దోచే అపురూపమైన ఫొటోలను తీస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆరించారు పిక్టోరియల్ ఫొటోగ్రాఫర్ తుమ్మలపల్లి వీరభద్రరావు. 2014 గానూ ‘అసోసియేట్ ఆఫ్ రాయల్‌ఫొటోగ్రాఫిక్ సొసైటీ’ అవార్డును అందుకున్నారు.
 
   అంతర్జాతీయ అవార్డుతో అరుదైన గౌరవం    ఫొటోగ్రఫీలో రాణిస్తున్న వీరభద్రం
 కాకినాడ కల్చరల్  :పల్లె అందాలు ఆయన ఫొటోల్లో ఒదిగిపోయాయి. చలిమంటల సరదాలు, వరి ధాన్యపురాశుల ఎగరబోతలు, జోడెడ్ల బళ్లు, గుంపులుగా వెళ్లే ఆవులు..ఇలా ఒక్కటి కాదు గ్రామీణ భారతాన్ని మొత్తం ఆయన తన ఫొటోల్లో బంధించారు. ఈ అందాలకు పరవశించిన లండన్‌లోని అంతర్జాతీయ సంస్థ ‘రాయల్ ఫొటోగ్రాఫర్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ అత్యున్నత ‘అసోసియేట్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ’ అవార్డుతో వీరభద్రాన్ని సత్కరించింది. 2014 సంవత్సరానికి గానూ ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మంది ఫొటోగ్రఫీ కళాకారులు పాల్గొన్నారు. వీరిలో 40 మందిని పోటీలో నిలబడగా.... ఏడుగురు ఫైనల్ జడ్జిమెంట్‌కు మిగిలారు. అందులో వీరభద్రం ప్రథమ స్థానంలో నిలిచి అవార్డుకు ఎంపికయ్యారు.
 
 రాజారవివర్మ ప్రేరణతో...
 ద్రాక్షారామ గ్రామంలో 1971లో జన్మించిన వీరభద్రం.. చిన్నతనంలో  రాజారవివర్మ పెయింటింగ్స్ చూసి ప్రేరణ పొంది చిత్రకళా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఈ ఆసక్తితోనే 1993 సంవత్సరం నుంచి పిక్టోరియల్ ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నారు. అప్పట్నుంచి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకు పిక్టోరియల్ రంగంలో జాతీయ, అంతర్జాతీయంగా 800 చిత్రాలకు అనుమతులు లభించగా, సుమారు 110 అవార్డులు, సర్టిఫికెట్లను సాధించారు. ప్రస్తుతం ‘గ్రామీణ భారతం’ భావనతో తీసిన ఫొటోలు  ప్రపంచ ప్రఖ్యాతి సాధించిపెట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్‌లో కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ ఫోటోగ్రాఫర్లు కె.పేర్రాజు, రవీంద్రనాథ్, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో మన దేశం నుంచి వీరభద్రం అరుదైన గౌరవం దక్కించుకోవడం ఆనందంగా ఉందని అభినందించారు. కార్యక్రమంలో అరున్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు