అయిదో రోజుకు కార్మికుల సమ్మె

15 Jul, 2015 01:58 IST|Sakshi
అయిదో రోజుకు కార్మికుల సమ్మె

- మంత్రి గంటాతో తేలని చర్చలు
- సమ్మె విరమించేదిలేదన్న జేఏసీ నేతలు
- నేటి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు:కమిషనరు
విశాఖపట్నం సిటీ :
మహా నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల సమ్మె మంగళవారానికి అయిదో రోజుకు చేరింది. ఔట్‌సోర్సింగ్,పారిశుధ్య కార్మికుల సమ్మె అయిదు రోజులుగా జరుగుతుంటే వారికి మద్దతుగా చేపట్టిన రెగ్యులర్ ఉద్యోగుల సమ్మె 010 పద్దు జీతాల కోసం చేపట్టారు.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు చెందినదని, జీవీఎంసీలో జరుగుతున్న సమ్మెతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు 010 పద్దులో జీతాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.విశాఖలోనే తమ జీతాలు 010 పద్దులో ఇవ్వడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇస్తున్నారని గుర్తింపు కార్మిక సంఘం స్పష్టంచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమించినా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె విరమించే అవకాశమే లేదంటున్నారు.
 
తూతూ మంత్రంగా మంత్రి గంటా చర్చలు
మంత్రి గంటా శ్రీనివాసరావు జేఏసీ నేతలందరితో సమావేశం ఏర్పాటు చేశారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఛాంబర్‌లో గంట పాటు చర్చలు జరిపారు. ఆశించిన ప్రకటన మంత్రి చేయలేదు. దీంతో చర్చల్లో ఏమీ తేలలేదు. పని చే సే వారికి అడ్డుపడొద్దని మంత్రి గంటా శ్రీనివాసరావు మున్సిపల్ జేఏసీ నేతలకు సూచించారు. కమిషనర్ ఛాంబర్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సమ్మె విష యం మున్సిపల్, ఆర్ధిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఎవరూ అడ్డుపడొద్దని సూచించారు.
 
ఆగ్రహంగా కమిషనర్ ప్రవీణ్..!
కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహంగా కనిపించారు. సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన పారిశుద్ద్య కార్మికులకు, మున్సిపల్ పారిశుద్ద్య కార్మికులకు మధ్య మంగళవారం పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత వతావరణం ఏర్పడేందుకు కమిషనర్ చర్యలే కారణమంటూ జేఏసీ నేతలు ఆరోపించడంతో కమిషనర్ మరింత ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి గంటా చర్చలప్పుడు కూడా కమిషనర్ ఆగ్రహంతోనే కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఒకటి రెండు చోట్ల కమిషనర్‌కు జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
 
ప్రతీ నెలా జీతాలు ఇవ్వలేం..!

రూ. 2 వేల కన్నా అదనంగా పారిశుద్ద్య కార్మికులకు జీతాలు పెంచితే జీవీఎంసీ ప్రతీ నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించలేదని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జీవీఎంసీకి వచ్చే ఆ దాయం రూ. 550 కోట్లు అయితే అందులో ప్రతీ ఏటా జీతాలు, పెన్షన్లు కోసం రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నామని జీతాలు పెంచితే రూ. 321 కోట్లకు బడ్జెట్ పెరుగుతుందని వివరించారు. వ్యాధులు ప్రబలకుం డా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్చంద సంస్థల సహకారంతో బుధవారం నుంచి చెత్తలు తొలగించనున్నట్లు ప్రకటించారు. 400 మంది ప్రైవేట్ వర్కర్లు, 25 జేసీబీలు, 52 లారీలు, 36 మంది డ్రైవర్లను రంగంలోకి దించి చెత్తను తొలగిస్తామన్నారు.
 
రెచ్చగొడితే ఊరుకోం
పారిశుద్ద్య కార్మికుల పని ఎవరైనా చేయొచ్చని అయితే రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదని జీవీఎంసీ గుర్తింపు కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ వివి వామన రావు స్పష్టం చేశారు. అఖిల పక్ష నేతలందరితో కలిసి ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచీ జీవీఎంసీలో అంతా సమ్మెలోకి వచ్చినట్టయ్యిందని చెప్పారు. తాగునీరు, వీధి లైట్లు తప్పా మిగిలిన అత్యవసర పనుల్లో దేనికీ కార్మికులు హాజరు కావడం లేదన్నారు. 010 పద్దుతో జీతాలు వచ్చే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు