ఫిఫ్టీ..ఫిఫ్టీ

5 Jul, 2015 01:28 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులకు ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవడం లేదు. తమ పరిధిలో వ్యాపారం చేసుకోవాలంటే 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనంటూ అక్కడి టీడీపీ ముఖ్యనేతలు హుకుం జారీ చేస్తున్నారు. ఈ వ్యాపారులంతా టీడీపీ సానుభూతిపరులైనా కప్పం కట్టకతప్పడం లేదు. అక్కడ చోటుచేసుకున్న రెండు ఘటనలు ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి చెందిన మద్యం దుకాణం వాటాల విషయంలో టీడీ పీ యువనేత మోసం చేశారంటూ అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. యువనేత వల్ల తాము నష్టపోయిన తీరు, తమను ఏవిధంగా మోసగించాడనే విషయాలను సూసైడ్‌నోట్‌లో రాసి మరీ పురుగుమందు తాగాడు.
 
 ఏం జరిగిందంటే.. గతేడాది నుంచి యల్లమంద గ్రామంలోని మద్యం దుకాణాన్ని సొసైటీ డెరైక్టర్ కుమారుడు ప్రధాన భాగస్వామిగా కొంతమందితో కలిసి నిర్వహిస్తున్నారు. ఇందులోనే భారీగా ఖర్చుచేసి రెస్టారెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా మద్యం లాటరీలో అదే గ్రామానికి చెందిన మరొకరు దుకాణాన్ని దక్కించుకున్నారు. లాటరీకి ముందు మద్యం దుకాణాన్ని నీకే వచ్చేలా చేస్తానని నమ్మబలికి తీరా వేరేవారికి రాగానే అందులో 50 శాతం వాటా యువనేత తీసుకున్నారు. దీనితో కలత చెందిన ఆ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు.  
 
 30 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకున్నా ఉపయోగం లేకుండా పోయిందనే భాధను అతని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అప్పుల పాలయ్యామని, తిరిగి తామెలా తీర్చాలంటూ వాపోయి ఆత్మహత్యేతనకు శరణమని బహిరంగంగా చెప్పి గ్రామసమీపంలోని పొలంలో పురుగుమందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని హుటాహుటీన ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సూసైడ్‌నోట్ బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. విదేశాల్లో ఉన్న యువనేత తాను పేటకు వచ్చిన తరువాత సమస్య పరిష్కరిస్తానని, అప్పటివరకు సమస్య పెద్దదిగాకుండా చూడాలని గ్రామపెద్దలను కోరినట్టు తెలిసింది.
 
 యువనేత తీరుపై అసంతృప్తి
 మద్యం దుకాణాల కేటాయింపుల్లో నిజమైన కార్యకర్తలను పట్టించుకోకుండా కేవలం తనకు 50శాతం వాటా ఇచ్చిన వారికే దుకాణాలను కట్టబెట్టడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. పార్టీ కార్యకర్తలు, నాయకులను పక్కనపెట్టి కేవలం స్వలాభం కోసం ఇతర పార్టీ వారితో భాగస్వామిగా యువనేత వ్యాపారం చేయాలని పూనుకోవటం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.  
 
 గురజాల నియోజకవర్గంలోనూ..
 గురజాల నియోజకవర్గంలోనూ లాటరీ ద్వారా మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు టీడీపీ ముఖ్యనేతకు 50 శాతం వాటా ఇస్తే తప్ప అక్కడ వ్యాపారం చేసుకోలేరట. ఇది స్వయంగా సదరు ముఖ్యనేతే మద్యం వ్యాపారులతో తెగేసి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దాచేపల్లి మండలం నడికుడి మద్యం దుకాణాన్ని 12 మంది టీడీపీ కార్యకర్తలు లాటరీలో దక్కించుకున్నారు. ఈ దుకాణాన్ని రూ.1.50 కోట్లకు కొనుగోలు చేస్తామని మద్యం వ్యాపారులు రావడంతో తమ అదృష్టం పండిందని వారు భావించారు. ఇదే సమయంలో అధికారపార్టీ ముఖ్యనేత నుంచి ఫోనొచ్చింది.
 
 తనకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనంటూ చెప్పేశారు. దీంతో అంతా ఆయన వద్దకు వెళ్లి తామూ టీడీపీకి చెందిన వారమేనని తమ దుకాణం జోలికి రావద్ధంటూ ప్రాధేయపడ్డారు. నియోజకవర్గంలో ఓ పద్ధతి పెట్టాను. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే మొత్తం దెబ్బతింటుంది. ఏదైనా ఉంటే గుంటూరులోని తన నివాసానికి వచ్చి మాట్లాడాలంటూ చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. నియోజకవర్గంలో కొందరు వాటాలు ఇచ్చేందుకు అంగీకరించగా మరికొందరు మాత్రం వేచిచూస్తున్నారు. అయితే ముఖ్యనేతకు వత్తాసుగా ఎక్సైజ్ అధికారులు సైతం మద్యం వ్యాపారులకు నచ్చజెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు