ఎన్నికలు వద్దు.. పెట్టాల్సిందే !

29 Jan, 2014 01:55 IST|Sakshi
ఎన్నికలు వద్దు.. పెట్టాల్సిందే !

సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్యుద్ధం
సచివాలయ హౌసింగ్ సొసైటీ భేటీలో ఉద్రిక్తత

 
 సాక్షి, హైదరాబాద్: సచివాలయ హౌసింగ్ సొసైటీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. మంగళవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో.. సొసైటీ పాలక మండలికి ఎన్నికల నిర్వహణ కోసం తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయడానికి సహకార శాఖ అధికారి రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన సొసైటీ సమావేశం జరిగింది. ఎన్నికలు నిర్వహించడానికి తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలంటే మొత్తం సభ్యుల్లో మూడో వంతు (1,200 మంది) హాజరు కావాలని, కానీ 200 మంది సభ్యులే హాజరైనందున సమావేశాన్ని వాయిదా వేయాలని నరేంద్రరావు నేతృత్వంలోని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
 
  ఇందుకు సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మురళీమోహన్ తదితర సీమాంధ్ర ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. 150 మంది సభ్యులు హాజరైతే తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తోందని, ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం వాయిదా వేస్తే.. తదుపరి భేటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని కోరారు. సొసైటీలో ఎక్కువ మంది సభ్యులు సీమాంధ్ర వారే ఉన్నారని, విభజన జరిగే సమయంలో ఎన్నికలు జరిగితే వారికే అధికారం దక్కుతుందని, తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
 
 ఎన్నికలు వాయిదా వేయాలని పట్టుబట్టారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకుల నుంచి రుణాలు కూడా అందడం లేదని, ఎన్నికలు జరపాల్సిందేనని సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో కొట్టుకునే వరకు వెళ్లింది. సీమాంధ్ర ఉద్యోగులు తమను దుర్భాషలాడారని, కొట్టేందుకు ప్రయత్నించారని, తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు డి-బ్లాక్ ముందు కాసేపు ధర్నా చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సీఎస్ చాంబర్ వద్దకు వెళ్లిన తెలంగాణ ఉద్యోగులు.. సీమాంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
 
 యూనియన్ల గుర్తింపు రద్దు చేయడానికి వెనుకాడం: సీఎస్
 తన చాంబర్ వద్ద ఉద్యోగులు గందరగోళ పరిస్థితులు సృష్టించడం పట్ల సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు తన చాంబర్ వద్ద నుంచి వెళ్లిపోవాలని గట్టిగా చెప్పారు. ఉద్యోగుల మధ్య విభేదాలు మితిమీరుతున్నాయని, ఇక మీదట సి-బ్లాక్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, యూనియన్ల గుర్తింపు రద్దు చేయడానికీ వెనకాడమంటూ ఉద్యోగ సంఘాలకు సీఎస్ నోటీసు జారీ చేశారు.

మరిన్ని వార్తలు