‘ఉల్లి’పోటు!

27 Aug, 2015 01:48 IST|Sakshi
‘ఉల్లి’పోటు!

చిత్తూరు (అర్బన్), తిరుపతి రూరల్: ఉల్లి ధర బయట భగ్గు మంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకెళ్లి ఎక్కిరిస్తోంది. ఈ నేపథ్యంలో రైతు బజారుకొస్తున్న సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం ఎగబడుతున్నారు. కొత్త సినిమా టికెట్ల కోసం ఎగబడ్డట్టు పలువురు బారులు తీరుతున్నారు.

జిల్లాలోని తిరుపతి, చిత్తూరు రైతు బజార్లకు బుధవారం సబ్సిడీ ఉల్లిపాయలొచ్చాయి. కిలో రూ.20 వంతున అధికారులు విక్రయానికి సిద్ధమయ్యారు.  ఉల్లిపాయల కోసం జనం ఎగబడ్డారు. ఉదయం 5 గంటల నుం చే క్యూలైన్లలో వేచి ఉన్నారు. చిత్తూరులోని రైతు బజార్‌లో 5 కౌంటర్లు ఏర్పా టు చేశారు. అయినా ఇబ్బందులు తప్పలేదు. అరుపులు, తోపులాటలు మిన్నంటాయి. చివరకు పోలీసుల జోక్యంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. వినియోగదారుల తాకిడి ఎక్కువవ్వడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉల్లిపాయలు ఇచ్చిన అధికారులు, తర్వాత కౌంటర్లు మూసేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు రైతు బజారును తనిఖీ చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలి రోజు చిత్తూరులో 20 టన్నులు తెప్పించగా 12 టన్నులు అమ్ముడయ్యాయని తెలిపారు. ఇక తిరుపతి రైతుబజార్‌కూ వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరారు. బుధవారం రైతు బజారుకు సెలవు అయినప్పటికీ ప్రజల సౌకర్యార్థం విక్రయిం చినట్లు రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ అయ్యప్పన్ తెలిపారు. బుధవారం ఒక్కరోజే 4,500 కిలోల ఉల్లిపాయలు విక్రయించినట్టు తెలిపారు.
 
 

>
మరిన్ని వార్తలు