మంత్రుల మధ్య ఆధిపత్య పోరు

29 Oct, 2015 00:48 IST|Sakshi
మంత్రుల మధ్య ఆధిపత్య పోరు

డీఆర్‌ఓ పోస్టు కోసం జోరుగా పైరవీలు
తాజాగా తెరపైకి కిషోర్‌కుమార్

 
నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) నియామకం కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకటో కృష్ణుడు.. రెండో కృష్ణుడు అంటూ నెలకో పేరు తెరపైకి వస్తున్నా... భర్తీ మాత్రం జరగడం లేదు. మంత్రుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు తోడు ఉన్నతాధికారుల వైఖరి కూడా కొత్త డీఆర్‌ఓ రాకకు బ్రేకులేస్తున్నాయి.
 
 విశాఖపట్నం : డీఆర్‌ఓ పోస్టు కోసం జిల్లాలో గతంలో పనిచేసిన పలువురు అధికారులు తమదైన రీతిలో పైరవీలు సాగించారు. ఏజేసీగా పనిచేసిన జేఎల్ నరసింహారావు, జెడ్పీ సీఈఓగా పని చేసిన మహేశ్వరరెడ్డి కూడా ఈ పోస్ట్ కోసం ప్రయత్నం చేశారు. మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికార్లు సైతం మోకాలడ్డడంతో నరసింహారావు చివరకు ఆర్ అండ్ ఆర్ ఎస్‌డీసీ పోస్టుతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.
 డీఆర్‌ఓగా వచ్చేందుకు మహేశ్వరరెడ్డి ఆశించినప్పటికీ ఇటీవలే బదిలీపై వెళ్లడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కడప జేసీ-2గా పనిచేస్తున్న సి.చంద్రశేఖరరెడ్డిని విశాఖ డీఆర్‌ఓగా నియమిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రి అయ్యన్న సిఫార్సుతో జరిగిన చంద్రశేఖరరెడ్డి నియామకానికి మంత్రి గంటా శ్రీనివాసరావు మౌఖిక ఆదేశాలతో బ్రేకు పడింది. ఇంతలో విశాఖ ఆర్డీఓ వెంకటేశ్వర్లును డీఆర్‌ఓగా గత నెల 15న ప్రభుత్వం నియమించింది. మంత్రి అయ్యన్న చేసిన ఈ ప్రయత్నానికి గంటా మరోసారి అడ్డుపుల్ల వేయడంతో 24 గంటలు తిరక్కుండానే ఈ ఉత్తర్వులను అబియన్స్‌లో పెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు విడుదల చేసింది. చివరకు చంద్రశేఖరరెడ్డి రాక పట్ల గంట సుముఖంగానే ఉన్నారని అనుకున్నంతలోనే.. ఆయనను హైదరాబాద్ భూపరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి.

కిషోర్ కోసం గంటా యత్నాలు : తాజాగా వుడా కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన జి.కిషోర్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఈయ న్ని డీఆర్‌ఓగా తీసుకొచ్చేందుకు మంత్రి గంటా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సిటీపై ఆధిపత్యం చలాయిస్తున్న మంత్రి గంటా డీఆర్‌ఓగా కిషోర్ వస్తే ఆయన్ని అడ్డం పెట్టుకుని రూరల్‌లో కూడా తన హవా సాగిస్తారన్న ఆందోళన అయ్యన్న వర్గంలో వ్యక్తమవుతోంది.తరచూ విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతుండడంతో ప్రధాని మొదలు కేంద్ర, రాష్ర్ట మంత్రులు, నెలకు రెండు మూడుసార్లు ముఖ్యమంత్రి పర్యటనలతో ప్రొటోకాల్ చూసే బాధ్యత డీఆర్‌ఓపై ఉంది. అలాంటి కీలకమైన పోస్ట్ ద్వారా జిల్లాపై పట్టు సాధించేందుకు ఇరువురు మంత్రులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తుల వల్ల ఈ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగానే ఉండిపోయింది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు