పోరు ముగిసింది

8 May, 2014 03:57 IST|Sakshi
పోరు ముగిసింది
  • అన్ని నియోజకవర్గాల్లో 70 శాతం దాటిన ఓటింగ్
  •      14 నియోజకవర్గాల్లో బారులు తీరిన ఓటర్లు
  •      వర్షం వచ్చినా లెక్కచేయని వైనం
  •      పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
  •      జిల్లాలో సరాసరి 78 శాతం పోలింగ్
  •      అత్యధికంగా నగరిలో 87.5 శాతం
  •      అత్యల్పంగా తిరుపతిలో 59.3 శాతం
  •      తిరుపతి లోక్‌సభ 72.37, రాజంపేట 77.28, చిత్తూరు 82.64 శాతం
  •  సాక్షి, చిత్తూరు : సార్వత్రిక సమరం బుధవారంతో ముగిసింది. ఓటర్ల చైతన్యంతో 14 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 70 దాటింది. జిల్లా మొత్తం మీద సరాసరి 79.27 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచే ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా ఓటర్లు బారులుతీరి కనిపించారు.

    జిల్లాలోని 30.36 లక్షల ఓటర్లకుగాను 24,06,584 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరి నియోజకవర్గంలో అత్యధికంగా 87.5 శాతం, తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 59 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం ప్రయివేటు కార్యాలయాలకు సైతం లేబర్ శాఖ ద్వారా అధికారిక సెలవు ప్రకటించటంతో ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. లోక్‌సభ స్థానాలైన రాజంపేటలో 77.28 శాతం, చిత్తూరులో 82.64 శాతం, తిరుపతిలో 72.37 శాతం నమోదైంది. గతంలో ఎప్పుడూ ఇంత స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
     
    వర్షంలోనూ పోలింగ్ కొనసాగింపు


    చిత్తూరు, నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య వర్షం ప్రారంభమైంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కనిపించింది. నిండ్రలో వర్షం పడుతున్నా వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొడుగు వేసుకుని పోలింగ్ సరళిని పరిశీలించడం కనిపించింది. కొప్పేడు, నారాయణవనం వంటి చోట్ల వర్షానికి షామియానాలు పడిపోయాయి.

    పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
     
    జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అక్కడక్కడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లు మొరాయించాయి. కొన్నిచోట్ల ఎన్నికల సిబ్బందికి వాటిని ఆపరేట్ చేసేది తెలియక పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. శ్రీకాళహస్తిలో శ్రీరాంనగర్‌కాలనీ, ముత్యాలమ్మగుడివీధి, భాస్కర్‌పేట, తొట్టంబేడు మండలంలో బోనుపల్లి, పెద్దకన్నలి, కొణతనేరి గ్రామాల్లో అర్ధగంట ఆలస్యంగా ప్రారంభమైంది.

    ఏర్పేడు మండలం ఇసుకతాగేలి, అంజిమేడు, రేణిగుంట మండలం ఎలమండ్యం, బాలుర హైస్కూల్‌లోనూ ఈవీఎంలు మొరాయించాయి. చిత్తూరు నియోజకవర్గంలోని కొంగారెడ్డిపల్లి, లక్ష్మినగర్ కాలనీ, నగరి నియోజకవర్గంలో పుత్తూరు, నిండ్ర, కుప్పం నియోజకవర్గంలోని ఏపూరులో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, కొలమాసనపల్లె, పెద్ద పంజాణి, రాజుపల్లిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తిరుపతి నియోజకవర్గంలోని బొమ్మగుంట, అక్కారంపల్లి, మున్సిపల్ స్కావెంజర్స్ కాలనీలో గంటసేపు మొరాయించాయి.
     
    ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

    చిన్నచిన్న గొడవలు మినహా పోలింగ్ ప్రశాం తంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ కే.రాంగోపాల్ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, పోలింగ్ శాతం కూడా గతంలో కంటే ఎక్కువగా నమోదైందని అన్నారు. ఎన్నికల కమిషన్ ఓటరు చైతన్య కార్యక్రమాలు ఫలించాయని, అధికారిక సెలవు ఇవ్వటం ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని తెలిపారు.
     

మరిన్ని వార్తలు