ఆన్‌లైన్‌లో ‘పందెం కోళ్లు’

7 Jan, 2020 11:44 IST|Sakshi
ఫేస్‌ బుక్‌ల ద్వారా పందెం కోళ్ల వివరాలు.. ధరలు ప్రదర్శిస్తున్న పెంపకం దారులు

సామాజిక మాధ్యమాల ద్వారా పెంపకందారుల అమ్మకాలు

డేగ... కాకి... రసంగి.. నెమలి..ఇవన్నీ పక్షులన్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ రకాల పందెం కోళ్లకు ఇవే పేర్లతో పిలుస్తారు. వీటికి ప్రత్యేకమైన పేర్లుండడమే కాదు..వేలల్లో ధరలు పలుకుతాయి. సంక్రాంతి దగ్గర పడడంతో పందెం కోళ్లకు గిరాకీ మొదలైంది. విక్రయాలు జోరందుకున్నా యి. ఇదే సమయంలో వీటి పెంపకందార్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తాము పెంచిన కోళ్లతో సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకొని ఆన్‌లైన్‌ విక్రయాలకు శ్రీకారం చుడుతున్నారు.

తూర్పుగోదావరి, అమలాపురం: ‘సంక్రాంతి సమయంలో కోడి పందేలను జరగనిచ్చేది లేదు...ఉక్కు పాదంతో అణచివేస్తాం’ అని ఓ వైపు పోలీసులు హెచ్చరిస్తున్నా...మరోవైపు పందేలకు నిర్వహకులు చిరు కత్తులు నూరే పనిలో పడ్డారు. సంక్రాంతి సమయం దగ్గర పడడంతో పందేల నిర్వహకులు బరులను సిద్ధం చేయడంతోపాటు పందేలకు కావాల్సిన కోళ్ల కొనుగోలుకు వేట ప్రారంభిస్తున్నారు. ఏడాది పొడవునా మేకమాంసం, నాటు గుడ్లు, పాలు, బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి వాటిని పందెం కోళ్లకు తినిపించి బలోపేతం చేస్తున్నారు. ఒక్కో పందెం కోడి ఆహారానికి అయ్యే ఖర్చు రోజుకు రూ.50కి పైబడి ఉంటుందని అంచనా. స్థానికంగా ఉన్న పందెం నిపుణులతోపాటు, బిహార్‌ నుంచి వచ్చే ప్రత్యేక ట్రైనీలు వీటికి శిక్షణ ఇస్తారు. ఇందుకోసం వీరికి నెలకు రూ.50 వేల వరకూ చెల్లిస్తారు. ఇంత ఖర్చు పెడతారు కాబట్టే వీటి ధర వేలల్లో ఉంటుంది. ఒక్కో కోడి రకాన్ని బట్టి రూ.6 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉంటుందంటే వీటి డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.

మన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలో పెంచే పందెం కోళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. మన జిల్లాలో రాజోలు దీవిలో చింతలపల్లి, సఖినేటిపల్లి, లక్కవరం, భట్టేలంక, శంకరగుప్తం, ఉప్పలగుప్తం మండలం ఎన్‌.కొత్తపల్లి, అల్లవరం మండలం గోడి, గోడిలంక పరిసర ప్రాంతాల్లో పెంచే పందెం కోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. కాకినాడ నుంచి వచ్చిన కొంతమంది రాజోలు దీవిలో పందెం కోళ్లను పెంచుతుండడం విశేషం. సాధారణంగా ఈ కోళ్లను స్థానికంగా పెంచే పెంపకందార్ల వద్దనే కొనుగోలు చేస్తారు. కానీ గత కొన్నేళ్లుగా  సామాజిక మాధ్యమాల పుణ్యమాఅని కొన్ని ప్రాంతాల్లో కోళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇందుకు తగినట్టుగా పెంపకందారులు ఆన్‌లైన్‌ విక్రయాలకు తెరదీశారు. కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది పెంపకందారులు ‘నూజివీడు కాక్స్‌’, అనంతపురం జిల్లా పెంపకదారులు ‘జాతికోళ్ల పెంపకం’, నెల్లూరు పెంపకందారులు ‘జాతికోళ్ల పెంపకం సేల్స్‌’ పేర్లతో ఫేస్‌ బుక్‌లలో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో ఆయా కోళ్లు తలపడే సన్నివేశాలను, కోళ్లను ప్రదర్శనకు ఉంచుతున్నారు. కొంతమంది ఏకంగా కోళ్ల రకాలు.. వాటి ధరలనూ ప్రదర్శిస్తున్నారు. పనిలో పనిగా సెల్‌ఫోన్‌ నెంబర్లను పంపించి క్రయ, విక్రయాలకు తెరదీస్తున్నారు. దీంతో పందెం కోళ్ల మార్కెట్‌ కొత్త తరహాలో పరుగులు తీస్తోంది.

మరిన్ని వార్తలు