జూ.డాల పోరు ఉద్ధృతం

20 Aug, 2014 01:09 IST|Sakshi
  •     అత్యవసర సేవలు బంద్
  •      రుయాలో రోగుల అవస్థలు
  •      జీవో 78 రద్దు చేయాలి
  • తిరుపతి : జీవో 78ని రద్దు చేయాల్సిందేనం టూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. 20 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు మంగళవారం నుంచి అత్యవసర  సేవలను బహిష్కరించారు. మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడక ల ఆస్పత్రి భవనం ఎదుట సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. జూనియర్ డాక్ట ర్లు అత్యవసర సేవలను బహిష్కరించడంతో రుయా ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి.
     
    ఓపీడీ బ్లాక్ గేట్లు మూతపడ్డాయి. ల్యాబ్, క్యాజువాలిటీతో పాటు వివిధ విభాగాలకు చెందిన వార్డుల్లో రోగులకు సేవలు సరిగా అందలేదు. అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్‌లో చికిత్సలు పొందుతున్న రోగుల్లో కొందరికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో ఇబ్బం ది ఏర్పడినట్లు సమాచారం. అయితే సర్వీస్ డాక్టర్లు వారి పట్ల శ్రద్ధ తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద జూనియర్ డాక్టర్ల సమ్మె ఇలాగే కొనసాగితే రుయాలో రోగులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే రూయా ఆస్పత్రిలో రోగులకు 80 శాతం సేవలు జూనియర్ డాక్టర్ల ద్వారానే అందుతున్నాయి.

    అత్యవసర సేవలను నిలిపివేసినప్పటికీ జూని యర్ డాక్టర్లు రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సామూహిక నిరాహార దీక్షలు చేపట్టిన 300 పడకల ఆస్పత్రి భవనంలోనే ఓపీలు నిర్వహించి తమ నిరసన కొనసాగించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు చిన్నం పెంచలయ్య, వాడ నాగరాజు, చంద్రశేఖరరెడ్డి, సుబ్రమణ్యం, మహిళా నేతలు విజయలక్ష్మి, ఆర్.లక్షి ్మ తదితరులు సామూహిక నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి జూనియర్ డాక్టర్ల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.

    ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ పేద మహిళలకు ఉచి తంగా కాన్పులు చేయడానికి 1963లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పడకలు చాలడం లేదన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు సాగించిన పోరాటం ఫలితంగా రూ.100 కోట్లతో 300 పడకల ఆస్పత్రి మంజూరైందని తెలిపారు. ఆ ఆస్పత్రిని జీవో 78 రూపంలో కార్పొరేట్ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన స్విమ్స్‌కు అప్పగించడం పేద మహిళలకు అన్యాయం చేయడమే అవుతుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం భేషజాలు వదిలి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
     
    కొవ్వొత్తుల ప్రదర్శన

     
    జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనలో భాగంగా మంగళవారం సాయంత్రం పట్టణంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి నుంచి ప్రకాశం రోడ్డు, గాంధీరోడ్‌ల మీదుగా నాలుగుకాళ్ల మండపం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు