కదిలే శవాలుగా మారొద్దు

20 Apr, 2018 11:25 IST|Sakshi
విద్యాశాఖాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భాస్కర్‌ 

హక్కుల కోసమే పోరాటం టీచర్లకు తగదు

విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

ఏలూరు (మెట్రో) : బాధ్యతలు విస్మరించి కేవలం హక్కుల కోసం పోరాటం చేసే టీచర్లు ఉన్నంత వరకూ విద్యావ్యవస్థలో మార్పు రాదని, కదిలే శవాలుగా ఎవరూ మారొద్దని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విద్యాశాఖాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ఎన్ని సంస్కరణలు అమలు చేసినా పనిచేయాలనే భావన లేనప్పుడు భావిభారత పౌరులను తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు.

నీతికథలు, వ్యాయామ విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వంటి ప్రత్యేక పుస్తకాలు ప్రింట్‌ చేసి పాఠశాలలకు అందించినా నేటికీ బోధన జరగలేదన్నారు. సింగపూర్‌లో 99 శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు విద్యనభ్యసిస్తారన్నారు. విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా విద్యాబోధన సాగించాలని ఆయన హితవు పలికారు. 20 పాఠశాలల్లో వంటగ్యాస్‌ బదులు కట్టెల పొయ్యిపై విద్యార్థులకు వంట చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

పాఠశాలల్లో క్రీడాప్రాంగణాలు, సభావేదికల నిర్మాణాలు ఈ వేసవిలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ ఆదేశించారు. పాఠశాలలు తెరిచే నాటికి పిల్లల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయాలన్నారు. డీఈఓ సి.రేణుక, సర్వశిక్షాభియాన్‌ పీఓ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి పైసా పూర్తిగా వినియోగించండి 

జిల్లా కేంద్రమైన ఏలూరులో నిర్మాణం చేపట్టే అంబేడ్కర్‌ భవన్‌ నిర్మాణానికి మంజూరైన రూ.1.20 కోట్లలో ప్రతి పైసా పూర్తిగా వినియోగించి అత్యాధునికంగా నిర్మించాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. అంబేడ్కర్‌ భవన నిర్మాణం పూర్తి పారదర్శకతతో చేపట్టాలన్నారు.

మరిన్ని వార్తలు