సినిమా మోజులో పడి...!

23 Mar, 2015 03:07 IST|Sakshi

క్రైం (కడప అర్బన్): నీ కుమార్తెను చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాకు పరిచయం చేస్తా.. అనగానే ఓ మధ్య తరగతి మహిళ వెంటనే ఆకర్షితురాలైంది. తర్వాత తానూ ఆ మాయ డెరైక్టర్ మోజులో పడింది. భర్త సంపాదించిన డబ్బుతోపాటు లక్షలాది రూపాయలను ధారపోసింది. భర్త, బంధువులు వారించినా వినలేదు. చివరకు ఎటో వెళ్లిపోయింది. వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో భార్య, ముగ్గురు పిల్లల అదృశ్యంపై కేసు నమోదైంది. ఈ సంఘటనపై భర్త, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణలోని అంశాలలో కొన్ని విషయాలు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిశాయి. వాటి వివరాలిలా ఉన్నాయి.
 
కడప నగరం మారుతీనగర్‌లో సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐగా పని చేస్తున్న శ్రీనివాసులుకు భార్య ఎ.రాజేశ్వరి (31), జ్యోతి ప్రియాదేవి (11), పవన్‌కుమార్ (9), కావ్యలక్ష్మి (5)లు ఉన్నారు. శ్రీనివాసులు జమ్ముకాశ్మీర్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తూ మూడు నెలలకు ఒకసారి సెలవుపై వస్తూ వెళుతూ ఉండేవాడు. రాజేశ్వరి మారుతీనగర్‌లో పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తూ ఉండేది. ఇదిలా ఉండగా కడప నగరం నాగరాజుపేట, ఐటీఐ ప్రాంతాలలో నివసిస్తూ ‘గాడ్ గిఫ్ట్ క్రియేషన్స్’ పేరుతో సినిమా తీస్తామంటూ ప్రమోద్‌కుమార్ అలియాస్ కె.మహమ్మద్ అలీ మురాద్ ప్రకటనలిచ్చారు.

ఈ ప్రకటనను చూసిన రాజేశ్వరి తన కుమార్తె జ్యోతి ప్రియాదేవిని డెరైక్టర్‌గా చలామణి అవుతున్న ప్రమోద్‌కుమార్ దగ్గరికి తీసుకెళ్లింది. ముందుగా శిక్షణనివ్వాలని తెలుపగా రాజేశ్వరి అందుకు అంగీకరించింది. కుమార్తెను  శిక్షణకు తీసుకెళుతున్న సమయంలోనే రాజేశ్వరికి ప్రమోద్‌కుమార్ మాయమాటలు చెప్పాడు. డాక్టర్ వేషం వేయిస్తామని చెప్పడంతో ఆమె ఆశ పడింది. తన కుమార్తెతోపాటు తానూ రంగుల ప్రపంచానికి అనుగుణంగా సిద్ధపడింది. భర్త  శ్రీనివాసులు పంపిన డబ్బులు,  ఇంకా లోను ద్వారా డబ్బులు తీసుకుని లక్షలాది రూపాయలు ఖర్చు చేసింది.

చివరకు భర్త మాటకంటే అతని మాటే నెగ్గేలా డెరైక్టర్ తనవైపునకు తిప్పుకున్నాడు. ఫిబ్రవరి నెలలో గండి క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. తర్వాత ఫిబ్రవరి 25న భర్త శ్రీనివాసులుకు ఫోన్ చేసి తాను పిల్లలను పాఠశాలకు తీసుకెళుతున్నానని చెప్పి మళ్లీ రాలేదు. స్వతహాగా ఆమె పిల్లలతోపాటు ఎక్కడికైనా వెళ్లిపోయిందా? లేక డెరైక్టర్ తన ఆధీనంలో ఏమైనా చేశాడా? అనే అనుమానంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు.
 
పోలీసుల అదుపులో అనుమానితుడు
ప్రమోద్‌కుమార్‌పై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీనివాసులు ఇంటికి వెళ్లి విచారించారు. ఫొటోలను సేకరించారు. ప్రమోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే రాజేశ్వరి భర్తకు ఫోన్ చేయడం, పిల్లలతోసహా వస్తున్నాననీ చెప్పడంతో మిస్టరీ వీడింది.  నేడో, రేపో రాజేశ్వరిని పిల్లలతోపాటు పోలీసులు రప్పించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు