నేదురుమల్లికి కన్నీటి వీడ్కోలు

11 May, 2014 01:47 IST|Sakshi
నేదురుమల్లికి కన్నీటి వీడ్కోలు

వాకాడు (నెల్లూరు జిల్లా), న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం వాకాడులోని ఆయన ఇంటి ఆవరణలో పార్థివదేహాన్ని ఉంచారు. వేలాదిమంది అభిమానులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జనార్దన్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర 5.10కి స్వర్ణముఖి నది వద్ద శ్మశానవాటికకు చేరుకుంది. జనార్దన్‌రెడ్డి చితికి ఆయన పెద్దకుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి నిప్పంటించారు.
 
 హాజరైన పలువురు ప్రముఖులు: మాజీ సీఎం జనార్దన్‌రెడ్డి అంత్యక్రియలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి జేడీ శీలం, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, చింతామోహన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సినీనటుడు మోహన్‌బాబు దంపతులు, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, సీవీ శేషారెడ్డి, టీడీపీ నేతలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ముంగమూరు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ రాజారామిరెడ్డి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు