అభివృద్ధే అంతిమ లక్ష్యం!

19 Jul, 2015 23:51 IST|Sakshi

 సిద్ధాంతం ప్రకారం  గిరిజనాభివృద్ధి
  సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతో పాలనపై దృష్టి
  వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ
  ఐటీడీఏ పీవో జ ల్లేపల్లి వెంకటరావు

 
 ప్రశ్న: డిప్యూటీ తహశీల్దార్ నుంచి పీఓగా వివిధ స్థాయిల్లో ఉద్యోగ బాధ్యతల్లో అనుభవాలు ఏమిటి?
 జవాబు: 1996లో పాలకొండ తహ శీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా అటుపై ఎలక్షన్ అధికారిగా, రాజాం, సంతకవిటి, పాతపట్నం, వంగర తహశీల్దార్‌గా, జిల్లా కలెక్టరేట్‌లో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పని చేశారు. అనంతరం విశాఖ జిల్లా పాడేరు డిప్యూటీ కలెక్టర్‌గా చేసి విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురంలో ఆర్డీఓగా రెండు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించాను. ఈ అనుభవం ఐటీడీఏ అభివృద్ధికి దోహదపడుతోందన్న నమ్మకం ఉంది.
 
 పీఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక్కడి స్థితిగతులను ఎలా అర్థం చేసుకున్నారు?
 గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన అనుభ వంతో పీఓగా పూర్తిబాధ్యతలతో సీతంపేట సబ్‌ప్లాన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో దశలవారీగా పర్యటిస్తున్నాను. గిరిజనుల సమస్యలను నేరుగా అధ్యయనం చేస్తున్నాను. తెలుసుకున్న, తెలుసుకోవాల్సిన అన్ని స్థితిగతులను స్వయంగా పర్యవేక్షిస్తాను. అటుపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సింది ఎంతో ఉందని గుర్తించాను.
 
 ప్రస్తుత ఎపిడమిక్ సీజన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలేమిటి?
 ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని అంశాలపై దృష్టిసారించదలిచా. అందులో ప్రధానమైనది గిరిజనుల ఆరోగ్యం. అందులో భాగంగానే గత అనుభవాలను నెమరవేసుకుని ఈ సీజన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాం. ఐటీడీఏ పరిధిలో గల 926 పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 900 పంచాయతీల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా మలాథియాన్ స్ప్రేయింగ్ చేయించాం. విద్యార్థులకు దోమతెరలు అందిస్తున్నాం. దోమలు వృద్ధి చెందకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం.
 
 ప్రతి ఏటా ఇవన్నీ జరుగుతున్నా.. గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు?
 ఐటీడీఏ పరిధిలోని వైద్యాధికారులతో సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తాం. సీజన్ పూర్తయ్యేవరకు వైద్యశిబిరాలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వనున్నాం. ప్రతి  గిరిజనుడి ఆరోగ్యంపై దృష్టిసారించేలా కార్యచరణ రూపొందించాం. సీతంపేట క్లస్టర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నాం.  ఇందులో భాగంగా ఈ నెల 21న సీతంపేటలో వైద్యసిబ్బందితో సదస్సు, 22న మెళియాపుట్టి, పాతపట్నం, టెక్కలి వైద్యసిబ్బంది, మలేరియా సిబ్బంది, ఎంపీడీవో సంయుక్తంగా పలాసలో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటాం.
 
 నాన్‌షెడ్యూల్డ్ ఏరియాను షెడ్యూల్డ్‌లో కలపాలన్న ప్రతిపాదనపై మీ స్పందన?
 ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే దృష్టిసారిస్తాం.
 
 ఏజెన్సీ ప్రజలకు ఏనుగులు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిపై మీ చర్యలు?
 ఏనుగుల ద్వారా నష్టపోయిన వారికి సకాలంలో పరిహారం అందేలా చూస్తున్నాం. ఏజెన్సీలో ఏనుగులు సంచరించేందుకు కొంత ప్రదేశాన్ని కేటాయించేలా అటవీశాఖాధికారులతో కలిసి సంయుక్తంగా చర్యలు చేపడతాం.
 
 గిరిజన విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు?
  ఐటీడీఏ పరిధిలో గురుకులాలు, ఆశ్రమ, పోస్టుమెట్రిక్, వసతిగృహాలతో పాటు అన్ని పాఠశాలల సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తాం. మెనూ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడుకి 100 రోజుల సమయం కేటాయిస్తాం.
 
 రక్షిత నీరు, రహదారులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఎలా పరిష్కరిస్తారు?
 క్షేత్ర పర్యటనలో భాగంగా ఈ సమస్యను గుర్తించాం. అన్ని గిరిజన గ్రామాలకు సురక్షితమైన నీటిని అందించేందుకు సంబంధిత శాఖ అధికారులతో చర్చనున్నాం. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాలపై దృష్టిసారించాం. ఇంజనీరింగ్ అధికారులతో మమేకమై పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తాం.  
 
 గిరిజన దర్బార్ నిర్వహణపై మీ అభిప్రాయం?
 గిరిజన దర్భార్‌లో వచ్చిన సమస్యలు మరోసారి పునరావృతం కాకుండా, అర్జీదారులకు కాలయాపన లేకుండా వచ్చిన అర్జీలను 15 రోజుల్లో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. సవరభాష, సంస్కృతి ప్రాచుర్యం పెంచేందుకు వారి సంఘ నేతలతో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం.


 ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రతిపక్ష నేతలను, ప్రజాప్రతినిధులను అధికారిక సమావేశాలకు పిలవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారు?
 ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అమలు ప్రజాప్రతినిధుల సమక్షంలోనే చేపడతాం. రాజకీయాలకు అతీతంగా గిరిజన అభివృద్ధిపై అన్ని పార్టీల సహకారాన్ని, సూచనలను పాటిస్తాం.  
 

>
మరిన్ని వార్తలు