ఎట్టకేలకు అంగీకారం!

4 Dec, 2018 17:47 IST|Sakshi

ఐదేళ్లుగా పంటల బీమా కోసం రైతుల ఎదురుచూపులు

20,655 మంది రైతుల దరఖాస్తులకు 

రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు అంగీకారంలో నిర్లక్ష్యం

మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి  పోరాటంతో కదలిక 

సాక్షి ప్రతినిధి, కడప: న్యాయంగా రావాల్సిన బీమా అందలేదు. రైతులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రత్యక్ష పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. వెరసి రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష పోరాటంతో ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ రాస్తూ నిర్ణయం తీసుకుంది. రైతులు వారి వారి పంటలకు బీమా చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ప్రీమియం చెల్లించిన తర్వాత బాధ్యత ఇన్య్సూరెన్సు కంపెనీలదే. బీమా చెల్లించాల్సిన సమయంలో దరఖాస్తులు సక్రమంగా పూరించలేదని అర్హులైన రైతులకు బీమా చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. రైతులకు తెలియక చేసిన తప్పులకు శిక్ష విధిస్తారా... అంటూ వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. వివిధ దశల్లో ప్రత్యక్ష ఆందోళన చేసింది, తుదకు ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ధర్నా చేపట్టారు. ఆపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లోపించింది. రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించేందుకు అంగీకరిస్తూ లేఖలో వెల్లడించిన వైనమిది.

జిల్లాలో 2012–13 పంటలబీమాకు శనగ, పొద్దుతిరుగుడు పంటలకు రైతులు బీమా ప్రిమియం చెల్లించారు. 76,750 మంది  బీమా చెల్లించగా వారిలో 21,965 క్‌లైయిమ్‌లను అగ్రికల్చర్‌ ఇన్య్సూరెన్సు కంపెనీ (ఏఐసీ) తిరస్కరించింది. అందులో ప్రధానంగా 20,655 దరఖాస్తులు పంటలు సాగుచేసిన తేది పొందుపర్చలేదని పంటల బీమా మంజూరు చేయకుండా తిరస్కరించింది. వారిలో 16,889 మంది బుడ్డశనగ, 3,766 మంది పొద్దుతిరుగుడు రైతులు ఉన్నారు. వారందరికీ పంటల బీమా మంజూరు చేయకుండా తిరస్కరించింది. ఈపరిస్థితుల్లో రైతులు  ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా అత్యంత చిత్తశుద్ధితో వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని ఎంచుకుంది. కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఏఐసీ అధికారులతో అనేక పర్యాయాలు చర్చించారు. అదేవిధంగా వ్యవసాయశాఖ కమిషనర్‌తో సైతం మంతనాలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి హైదరాబాద్‌లోని ఏఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అడ్డంకులను చేధించుకుని ఏఐసీ జీఎం రాజేశ్వరి ద్వారా  ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోనూ, కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్‌ సెక్రెటరీతోనూ ప్రత్యేకంగా పలుమార్లు కలుస్తూ ఐదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను వివరిస్తూ, ప్రత్యేక సమావేశాల ద్వారా వ్యవహారాన్ని కొల్కి తెచ్చారు. ఆమేరకు 2016 మార్చి 10న కేంద్రప్రభుత్వం లేఖ రాసింది. పెండింగ్‌లో ఉన్న ఆ క్లైయిమ్స్‌ రాష్ట్రప్రభుత్వ వాటానిమిత్తం అంగీకారం కోరింది. ఇలాంటి తరుణంలో తక్షణమే స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించింది. 2018 సెప్టెంబర్‌ 19న అగ్రికల్చర్‌ స్పెషల్‌ సెక్రెటరీ డి.మురళీధర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ రాశారు.

చిత్తశుద్ధి పోరాటం చేసిన ఫలితమే...
పంటలకు బీమా ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా రైతులకు బీమా మంజూరు కాకపోవడంపై వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా నిలిచింది. చిత్తశుద్ధితో అడుగడుగునా వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష పోరాటం చేసిన నేపథ్యంలో తక్షణమే స్పందిస్తే ఆ పార్టీకి మంచిపేరు వస్తుందని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలోనైనా శనగ రైతులకు పంటల బీమా చెల్లింపు చేస్తామని ప్రజాసంకల్పయాత్రలో సైతం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితంగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లేఖకు స్పందిస్తూ అంగీకార లేఖ రాసింది. గతంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితిని రైతులు చవిచూశారు. 2012–13 రబీ పంటల బీమా మంజూరు చేయడంలో ఏఐసీ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఎంపీ హోదాలో పలుమార్లు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడం, స్వయంగా ఇన్సూరెన్సు అధికారులను కలవడంతో రూ.132కోట్లు మంజూరు చేస్తూ ఏఐసీ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా 17,161మంది శనగ రైతులకు రూ.88 కోట్లు బీమా మొత్తం జమ అయింది. రెండో విడతగా 11,286 మంది శనగ రైతులకు రూ.44కోట్లు బీమా మొత్తం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లో శనగరైతులు సైతం కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కృషిని కొనియాడుతూ వచ్చారు. తక్షణమే పరిహారం అందించకుండా దాదాపు నాలుగు వారాలు అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. ‘అమ్మ పెట్టదు...అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా వ్యవహరించారు. తాజాగా 2012–13 రబీ పంటల బీమా దరకాస్తులు పూరించడంలో పంట సాగుచేసిన తేది పొందుపర్చలేదనే కారణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు