ఊరిస్తున్న ‘రెవెన్యూ’ ఖాళీలు

11 Dec, 2013 03:10 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్: వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు మరో పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుండడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పెరిగిన పని ఒత్తిడి వల్ల వీఆర్‌వో, వీఆర్‌ఏ ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం జిల్లాలో ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారంభించింది. రాష్ర్ట విభజన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలపై కొంత సందిగ్ధం నెలకొన్నప్పటికీ.. మరో పది రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో త్వరితగతిన ఆన్‌లైన్ వ్యవస్థను సరిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సిబ్బంది కొరత వల్ల పలు జిల్లాలో ఆన్‌విధానం అభాసుపాలవుతోంది. దీంతో వెంటనే ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కారు పూనుకుంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ ద్వారా రాత పరీక్ష, ప్రతిభ ఆధారంగా వీఆర్‌వో, వీఆర్‌లను ఎంపిక చేయనున్నారు.
 
 జిల్లాలో 810 వీఆర్‌వో పోస్టులకు ప్రస్తుతం 662 మంది పనిచేస్తున్నారు. ఇందులో 40 మందికి వీఆర్‌ఏ నుంచి వీఆర్‌వోగా ఇటీవలే పదోన్నతి కల్పించా రు. ఇంకా 138 ఖాళీలు ఉండగా, ఇందులో 97 రెగ్యులర్ పోస్టులను రాతపరీక్ష, ప్రతిభ ద్వారా భర్తీ చేయనున్నారు. 41 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. జిల్లాలో 3,257 వీఆర్‌ఏ పోస్టులకు, 3,034 మంది ఉన్నారు. 237 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని రాత పరీక్ష, ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. గతంలో మాదిరిగానే రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ విధానం అమలు చేయనున్నారు. వీఆర్‌వోలకు ఇంటర్, వీఆర్‌ఏలకు టెన్త్, ఇంటర్ విద్యార్హతలు ఉండాలి. గతేడాది 60 వీఆర్‌వో, 246 వీఆర్‌ఏ పోస్టులను రాత పరీక్ష ఆధారంగానే భర్తీ చేశారు.
 
 ఉద్యోగాల వేటలో
 నిరుద్యోగులు
 జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాల వేటలోపడ్డారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. 92 పోస్టుల కోసం 13,837 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 150 మంది పోటీపడ్డారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 87 మందికి వెయిటేజీ మార్కులతో పోస్టులు రెగ్యులర్ పోస్టులు దక్కే అవకాశముంది. మిగిలిన ఐదారు పోస్టులకే దరఖాస్తుదారులు పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ కార్యదర్శులకు విద్యార్హత డిగ్రీ కాగా.. వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు ఇంటర్, టెన్త్ విద్యార్హతలుగా నిర్ణయించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులకు రెట్టింపు సంఖ్యలో నిరుద్యోగులు పోటీపడే అవకాశాలున్నాయి.
 

>
మరిన్ని వార్తలు