ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం

6 Feb, 2019 04:01 IST|Sakshi

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

గతేడాది కేటాయింపులతో పోల్చితే 18.38 శాతం బడ్జెట్‌ పెంపు

నాలుగు నెలల ఓటాన్‌ అకౌంట్‌కు రూ.76,816.85 కోట్లు 

శాసనసభకు బడ్జెట్‌ సమర్పించిన ఆర్థిక మంత్రి యనమల 

సాక్షి, అమరావతి: సంక్షేమం, సమతుల అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం వల్లే రాష్ట్రం ప్రగతిబాట పట్టిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఐదేళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం అనేక సవాళ్లను అధిగమించి ప్రగతి బాట పట్టిందన్నారు. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.26 లక్షల కోట్లతో, మొదటి నాలుగు నెలలకు సంబంధించి రూ. 76816.85 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మంగళవారం ఆయన శాసనసభకు సమర్పించారు. 2019– 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించామని, 2018– 19 కేటాయింపులతో పోల్చితే ఇది 18.38 శాతం ఎక్కువని వివరించారు.

ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 11.45 గంటలకు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన యనమల సరిగ్గా 1.22 గంటలకు జైహింద్‌ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ‘దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా మూడేళ్లు రెండంకెల వృద్ధి సాధిస్తుందని మనం ఊహించామా? 70 ఏళ్ల ఆంధ్రుల కల, రాష్ట్రం జీవనాడి అయిన పోలవరం డ్యామ్‌ శరవేగంగా పూర్తవుతుందని, దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ఊహించామా? ఇవన్నీ ఈరోజు నిజంగానే సాధించాం’ అని  యనమల పేర్కొన్నారు.
 
ఉన్నత విద్యకు పెద్దపీట..
సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల పట్ల తమ ప్రభుత్వం పూర్తి జాగరూకతతో ఉందని యనమల చెప్పారు. జాతీయ స్థాయిలో వంద అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఆరు మన రాష్ట్రానికి చెందినవే కావడం ఉన్నత విద్యకు తాము ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. 2019 – 20 బడ్జెట్‌లో మానవ వనరుల విభాగానికి రూ. 29,955 కోట్లు కేటాయించామని, ఇది మొత్తం బడ్జెట్‌లో 11.5 శాతమని తెలిపారు. అమరావతిని ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

అమరావతి నిర్మాణానికి రూ. 1.09 లక్షల కోట్లు ఖర్చు
అమరావతి నిర్మాణానికి రూ. 1,09,023 కోట్లు అవుతుందని అంచనా వేయగా మొదటి దశలో రూ. 39,875 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో  ఉన్నాయని యనమల చెప్పారు. తమ ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్రం విద్యుత్తు లోటు నుంచి మిగులు రాష్ట్రంగా మారిందన్నారు. ‘తల్లి గర్భం నుంచి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. పురుషులతో మహిళలు పోటీపడే సమాజం ఏర్పాటే మా లక్ష్యం.

అందుకే పసుపు కుంకుమ కింద ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఇప్పుడు మరోమారు 93.81 లక్షల మందికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ.9,381 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం.  రూ. 24 వేల కోట్ల రుణ భారం నుంచి రైతులను విముక్తులను చేశాం. ఆఖరి రెండు వాయిదాలను త్వరలో జమ చేస్తాం’ అని యనమల పేర్కొన్నారు. పెట్టుబడి రహిత సహజ సేద్యం (జెడ్‌బీఎన్‌ఎఫ్‌)లో రాష్ట్రం అగ్రగామిగా ఉందని ప్రకటించారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి పి.నారాయణ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివారు.
 

యనమల బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు...
►రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే మరో పథకానికి రూ. 5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నా. 

►కనీస మద్దతు ధరలు లేని సమయంలో రైతును ఆదుకునేందుకు విపణి ప్రమేయ నిధి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు పెంపు. 

►పశువుల బీమా కోసం బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయింపు.  

►ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ యువతకు ప్రస్తుతం నెలకు రూ. 1000 చొప్పున ఇస్తున్న నిరుద్యోగ భృతి రూ. 2000కి పెంపు. ఈ పథకం కింద 4.3 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ప్రకటన.

►వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు రూ. 3,000 కోట్లు. జనాభా దామాషా ప్రకారం  కార్పొరేషన్లకు నిధుల పంపిణీ.


►అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్‌షిప్‌ రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంపు.

►ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద 2019 – 20 కేటాయింపులు 28 శాతం పెంచి రూ. 14,367 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటన. ఎస్టీ సబ్‌ప్లాన్‌ 33 శాతం పెంచి రూ. 16,226 కోట్లు కేటాయింపు ప్రతిపాదన.

►ఆరోగ్య శాఖ బడ్జెట్‌ రూ. 8,463 కోట్ల నుంచి రూ. 10,032 కోట్లకు పెంపు. ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకానికి కేటాయింపులు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,200 కోట్లకు పెంపు. 


 

మరిన్ని వార్తలు