మండల, జిల్లా పరిషత్‌లకూ ఆర్థిక సంఘం నిధులు

10 Jun, 2020 03:38 IST|Sakshi

గ్రామ పంచాయతీలతోపాటు వాటికీ వాటా 

ఈ ఏడాది పంచాయతీరాజ్‌ సంస్థలకు రూ.2,625 కోట్లు కేటాయింపు

సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా నిధుల విడుదల నిలిచిపోవడంతో నీరసించిన మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్తులకు ఆర్థిక ఆసరా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ ఏడాది పంచాయతీరాజ్‌ సంస్థలకు విడుదల చేసే నిధులలో 15 శాతం మండల పరిషత్‌లకు, మరో 15 శాతం జిల్లా పరిషత్‌లకు, 70 శాతం గ్రామ పంచాయతీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ సంస్థలకు రూ.2,625 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 660 మండల పరిషత్‌లకు రూ.393.75 కోట్లు అందనున్నాయి. 13 జిల్లా పరిషత్‌లకు మరో రూ.393.75 కోట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీలకు రూ.1,837.5 కోట్లు జనాభా ప్రాతిపదికన పంచాయతీరాజ్‌ శాఖ కేటాయించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.  

2015 నుంచి నిలిచిన నిధులు.. 
2015 ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా వంద శాతం నిధులు గ్రామ పంచాయతీలకే కేటాయించారు. మండల, జిల్లా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించాలని కేంద్రం సూచించినా  టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. దీంతో జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్‌ ప్రెసిడెంట్లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారారనే విమర్శలున్నాయి. మరోవైపు పంచాయతీలకు నిధులు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో సర్పంచులు అధికారం చలాయించారు. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపుపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 70 : 15 : 15 నిష్పత్తిలో నిధులు కేటాయించేందుకు రాష్ట్రం అనుమతి తీసుకుంది.   

ఈసారి మరో మెలిక.. 
పంచాయతీరాజ్‌ సంస్థలకిచ్చే నిధులలో 50 శాతం బేసిక్‌ గ్రాంట్స్‌ రూపంలో, మిగిలిన 50 శాతం టైడ్‌ గ్రాంట్స్‌ రూపంలో విడుదల చేయనున్నట్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ లేఖలు రాసింది. బేసిక్‌ గ్రాంట్‌ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఓడీఎఫ్‌ కార్యక్రమాల అమలుకు వ్యయం ఆధారంగా టైడ్‌ గ్రాంట్స్‌ను రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు కేంద్రం లేఖలో స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు