ఎమ్మెల్యే ఫిర్యాదుతో అవినీతి డొంక కదిలింది!

19 Nov, 2019 10:18 IST|Sakshi
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌

కూపీ లాగుతున్న ఇంటెలిజెన్స్‌ విభాగం

ఆర్థిక అవకతవకలపై సర్కార్‌ సీరియస్‌

అవినీతి గుట్టువిప్పిన ప్రాథమిక నివేదిక

10తో ప్రారంభమై 33కు చేరిన అంశాలు

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు బాధ్యులను గుర్తించడంలో ప్రభుత్వం వేగం పెంచింది. రైతుల రెక్కల కష్టంతో లాభాల బాటలో నడుస్తున్న బ్యాంకు సొమ్మును అడ్డగోలుగా దుబారా చేసిన తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గడచిన ఐదేళ్ల డీసీసీబీ పాలనతోపాటు పొడిగించిన రెండేళ్ల ప్రత్యేక పాలనలో అవకతవకలు భారీగా జరిగినట్టు ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికలో స్పష్టమైంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఫిర్యాదుతో డీసీసీబీలో కదిలిన అవినీతి డొంక చాంతాడును మించిపోతోంది.

ఎమ్మెల్యే పది అంశాలపై చేసిన ఫిర్యాదులపై పరిశీలన ప్రారంభిస్తే అవి చివరకు 33 అంశాలకు చేరుకున్నాయి. డీసీసీబీలో జరిగిన ఆర్థిక అవకతవకలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు విభాగాల్లో అవసరానికి మించి అదనంగా లక్షలు ఖర్చు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. రైతుల సొమ్మును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేశారన్నది ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదిక సారాంశంగా ఉంది. సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పాండురంగారావు, కాకినాడ డివిజనల్‌ సహకార అధికారి కె.పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అధికారుల బృందం శాఖాపరమైన విచారణ నిర్వహించింది.

ఏడేళ్ల పాలనపై ప్రాథమిక నివేదిక
డీసీసీబీ పాలకవర్గం గడువు 2018 ఫిబ్రవరి 17తో ముగిసిపోయింది. కానీ అప్పటి పాలకుల ఆదేశాల మేరకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్‌ పాలకవర్గ పదవీ కాలాన్ని రిఫరెన్స్‌ నంబర్‌ 1447/2018–సీ ద్వారా 2018 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఒకసారి,  అదే ఏడాది ఆగస్టు 12 వరకూ రెండోసారి, 2019 ఫిబ్రవరి 12 వరకూ మూడోసారి పొడిగించారు. పొడిగింపుతో కలిపి డీసీసీబీ పాలకవర్గం మొత్తం పాలనా కాలంలో 45 పాలకవర్గ సమావేశాలు నిర్వహించి 881 తీర్మానాలను ఆమోదించింది. మొత్తం పాలనాకాలంలో ఆమోదించిన తీర్మానాలపై విచారణాధికారుల బృందం డీసీసీబీలో రేండమ్‌గా (మచ్చుకు) కొన్ని విభాగాలు, కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) పరిశీలించగా గుర్తించిన ఆర్థిక అవకతవకలను ప్రభుత్వానికి నివేదించారు.

చైర్మన్‌ వరుపుల రాజా రుణాల కోసం ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ, హెచ్‌ఆర్‌డీ, ఆడిట్‌ ఇలా మొత్తంగా ఆరు కమిటీలను అధికార, అనధికారులతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత విడుదలైన రుణాలు, ఉద్యోగులకు 40 రోజుల ఎక్స్‌గ్రేషియా తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయని ప్రాథమిక విచారణ నిగ్గు తేల్చింది. ఈ క్రమంలో గడచిన ఐదేళ్ల పూర్తి కాలంతోపాటు పొడిగించిన రెండు సంవత్సరాల కాలంలో డీసీసీబీలో ఆర్థిక అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతుల రెక్కల కష్టాన్ని ఇష్టారాజ్యంగా దుబారా చేసిన వ్యవహారాలపై ప్రాథమిక విచారణ నివేదిక చేతికొచ్చాకనే 51 విచారణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

విచారణ షురూ
అమలాపురం డివిజనల్‌ సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్‌ విచారణాధికారిగా బాధ్యతలు తీసుకొని పక్షం రోజులైంది. గత పాలనాకాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును సోదాహరణంగా విచారణ జరుగుతోంది. గుర్తించిన అవకతవకలను ఎప్పటికప్పుడు సహకారశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఓ పక్క 51 విచారణ చురుగ్గా జరుగుతుండగా మరోవంక ఇవే అంశాలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను స్టేట్‌ ఇంటెలిజెన్స్‌  తెలుసుకుంటోంది. ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఒక బృందం రెండు రోజుల కిందటే రంగంలోకి దిగింది.

ఆ బృందం ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తోంది. అవకతవకలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన పీఏసీఎస్‌లు, డీసీసీబీలో పలు సెక్షన్‌ల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమైందని విశ్వసనీయ సమాచారం. అవకతవకలపై సహకార అధికారులు తయారుచేసిన ప్రాథమిక నివేదికపై కూడా ఇంటెలిజెన్స్‌ కూపీ లాగుతోంది.

ఇతర విచారణలతో మాకు సంబంధం లేదు
సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుతున్న 51 విచారణకు మిగిలిన విభాగాలు చేసే విచారణలతో సంబంధం లేదు. మా దృష్టికి వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రతి అంశంపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఇంటిలిజెన్స్‌ వంటి ఇతర విచారణలు మా పరిధిలోకి రావు. వాటితో సంబంధం లేకుండా మా విచారణ స్వతంత్రంగా జరుగుతుంది.
– బి.దుర్గాప్రసాద్, డివిజినల్‌ కో ఆపరేటివ్‌ అధికారి, అమలాపురం 

మరిన్ని వార్తలు