స్తంభించిన ఆర్థిక లావాదేవీలు

6 Aug, 2013 01:42 IST|Sakshi

 సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆరు రోజు లుగా జిల్లాలో బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక సంస్థలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాయి. జూలై 31వ తేదీ నుంచి నేటి వరకూ జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు పనిచేస్తున్న ప్రధాన జాతీయ బ్యాంకు లు, ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, బంగారుపాళెం, పీలేరు, వాయల్పాడు వంటి  పట్టణాల్లోనూ బ్యాంకులు పని చేయ టం లేదు. ప్రతి రోజూ సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా హోటళ్లు, దుకాణాలతో సహా, బ్యాంకులను బంద్ చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా బ్యాంకుల వినియోగదారులు కార్యకలాపాలు సాగక బ్యాంకులకు వచ్చి వెనుతిరిగి వెళ్తున్నారు.
 వెయ్యికోట్లకు పైగా స్తంభన
 జిల్లా వ్యాప్తంగా 35కు పైగా ఉన్న జాతీయ, వాణిజ్య, కార్పొరేట్ బ్యాంకుల్లో వాణిజ్య కార్యకలాపాల స్తంభన వెయ్యికోట్ల రూపాయలకు పైగా ఉంటుందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ఆర్థిక సంస్థలు మొత్తం 800 వరకు ఉన్నాయి. వీటిల్లో ఐదురోజులుగా ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. దీంతో నగదు మార్పిడి జరగక,  జిల్లాలోని వాణిజ్య రంగంపై ప్రభావం చూపుతోంది. ఆగస్టు 5వ తేదీకి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఖాతాల్లో జమ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఖజానా శాఖ కార్యకలాపాలు కూడా స్తంభించాయి. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వ పింఛన్ల చెల్లింపులు, ఇతర ప్రభుత్వ శాఖల చెల్లింపులు నిలిచిపోయాయి. కేవలం సోమవారం మాత్రం ట్రెజరీ(ఖజనా శాఖ)లో ఒక రోజు పని జరి గింది. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకు సంబంధించిన కోట్ల రూపాయల జీతాలు నిలిచిపోవటంతో ఉద్యోగులు డబ్బుల కోసం వెతుక్కునే పరిస్థితి తలెత్తింది.
 ఏటీఎంలు ఖాళీ
 జూలై 31వ తేదీ నుంచి వరుసగా బ్యాంకులు పనిచేయకపోవడంతో ఏటీఎంలన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తం 500కు పైగా ఉన్న వివిధ బ్యాంకుల ఏటీఎంల్లో డబ్బులు నిల్వ ఉంచలేకపోయారు. ఉన్న అరకొర నిధులు ఒక్క రోజులోనే వినియోగదారులు డ్రా చేయటంతో మూతపడ్డాయి. ఎస్‌బీఐ ఏటీఎంలు పూర్తిగా ఖాళీ కావటంతో ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలు, యూనియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఏటీంలకు వినియోగదారులు పరుగులు దీస్తున్నారు. ఏటీఎంల ముందు రాత్రుల్లో కూడా బారులు తీరారు. నాలుగురోజుల తరువాత ఆదివారం కొన్ని ఏటీఎంలలో డబ్బులు నింపటంతో ఏటీఎం కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఆ ఏటీఎంల్లో కూడా సోమవారం ఉదయం కల్లా డబ్బులు అయిపోయాయి. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ అవుట్ సర్వీ సు బోర్డులతో ఏటీఎంలు దర్శనమిచ్చాయి. వరుసగా బంద్ కొనసాగనుండటంతో డబ్బు లు డ్రా చేసేందుకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు.

మరిన్ని వార్తలు