ఫైనాన్స్ పేరుతో మరో మాయ

1 Aug, 2013 03:52 IST|Sakshi

పాయకరావుపేట, న్యూస్‌లైన్: ప్రజల అమాయకత్వం, ఆశ, విశ్వాసం పెట్టుబడిగా ఫైనాన్స్ వ్యాపారం చేసిన మరో ఘరానా మోసగాడు కోటి రూపాయల మేరకు జనానికి టోపీ పెట్టాడు. పాయకరావుపేటలో చీటీలు, స్కీములు నిర్వహించి... వడ్డీకి అప్పులు చేసిన విశాఖ డెయిరీ పార్లర్ ఏజెంట్ కోటి రూపాయల మేరకు మోసం చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు బుధవారం లబోదిబోమన్నారు. పట్టణంలోని మంగవరం రోడ్డులో విశాఖ డెయిరీ పార్లర్ నడుపుతున్న గోళ్లరవి ఫైనాన్స్ స్కీములు నిర్వహించేవాడు. చీటీలు వేయడమే కాకుండా వడ్డీకి అప్పులు తీసుకున్నాడు. మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులపై మంచితనం పేరుతో వల విసిరి భారీగా డబ్బు సేకరించాడు.
 
  సత్యవరం గ్రామానికి చెందిన గోళ్ల రవి మంగవరం రోడ్డులో విశాఖ డెయిరీ ఏజె న్సీ నిర్వహిస్తూ గేదెలు, ఆవులతో డెయిరీ ఏర్పాటు చేసి అందరికి పరిచయస్తుడుగా మారాడు. ఆపై మౌనిక మినీ మనీ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేశాడు. దీనిలో 244 మంది సభ్యులను చేర్చుకుని నెలకు రూ. 500 వంతున వసూలు చేశాడు. సభ్యులకు ఆఫర్లతో ఆశ చూపి క్రమం తప్ప కుండా డబ్బు వసూలు చేశాడు. ఈఏడాది అక్టోబర్21తో ఈ స్కీము పూర్తి కానుంది. అర లక్ష, లక్ష చీటీలు వేసి మధ్య తరగతికి చెందిన కుటుంబాలకు చెందిన మహిళల నుండి రూ.40 ల క్షలువరకూ వసూలు చేశాడు. చీటీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా తిప్పేవాడు.  డెయిరీ ద్వారా పట్టణంలో ఉద్యోగులు, వ్యాపారులు మహిళలకు పాలు సరఫరా చేస్తూ  వీరి నుండి సుమారు రూ. 40 లక్షల వరకూ అప్పులు చేశాడు.
 
  స్కీముల ద్వారా ఒకేసారి డబ్బు వస్తుందని ఆశపడిన  మహిళా కూలీలు, సామాన్యులు పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చారు. అమ్మాయిల పెళ్లికి కట్నం కోసమని సొమ్ము దాచిన కొందరు మహిళలు, వ్యాపారులు కూడా రవి వలలో చిక్కారు. వీరంతా సుమారు రూ. 40 లక్షల వరకూ  రవికి ఇచ్చారు. అయితే రెండు నెలలుగా రవి కనిపించకపోయాడు. కానీ తాను  నడుపుతున్న పార్లర్‌లో వున్న అమ్మయిల ద్వారా స్కీము, చీటీ డబ్బులు వసూలు చేయించేవాడు. రెండు నెలలుగా  రవి కనిపించకపోవడంతో స్థానికులు వాకబు చేయగా, డెయిరీలోని గేదెలు, ఆవులను అమ్మేసినట్టు తెలియడంతో నిర్ఘాంతపోయారు. రవి అద్దెకు వుంటున్న ఇంటి వద్దకు వెళ్లి అడగ్గా ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు ఇంటి యజమాని చెప్పారు. దాంతో బాధితులు బుధవారం మంగవరం రోడ్డులోని డెయిరీ పార్లర్ వద్ద ఆందోళన చేపట్టారు.
 
 పక్కా పథకం : నాలుగేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా తిరిగిన రవి, స్థానిక నాయకులతో సన్నిహితం గా మెలిగాడు. అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆవులు, గేదెలు కొని డెయిరీ పెట్టి పాలు సరఫరా చేశాడు. మంచివాడిగా గుర్తింపు పొందాడు. ఆ ముసుగులోనే మాయ చేశాడు. ఇతని తమ్ముడు వాసు కూడా గతంలో రెండు సార్లు మోసం చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.
 
 కష్టార్జితం దోచుకున్నాడు..
 రోజంతా కష్టపడి సంసాదించినదంతా స్కీముల్లో పెట్టి నష్టపోయామని వెలగా రమణమ్మ, పాసున ల క్ష్మి, నూకరత్నం, బేబీ తదితర మహిళలు విలపించారు. వడ్డీ ఇస్తానని నమ్మపలికి సుమారు రూ. 20 లక్షల వరకూ కాజేశాడని జగతా స్వామి, రమణారెడ్డి తదితరులు తెలిపారు.నెలరోజులుగా రవి ఫోన్ పని చేయకపోయినా మోసపోయామనుకోలేదని వీరు ఆవేదనతో చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు