ఫైన్.. ఇక ఆన్‌లైన్ !

25 Apr, 2015 02:51 IST|Sakshi
ఫైన్.. ఇక ఆన్‌లైన్ !

వాహనచోదకులకు ఊరట
అపరాధ రుసుం చెల్లింపు సులభతరం
తుదిమెరుగులు దిద్దుతున్న అధికారులు
పక్షం రోజుల్లో అమల్లోకి..

 
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులు జరిమానాలు ఇకమీదట ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఇందుకు నగర పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
విజయవాడ సిటీ : నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల వద్ద  పోలీసుల చేతివాటానికి చెక్ పెట్టిన కమిషనరేట్ అధికారులు.. వాహనదారుల అపరాధ రుసుం చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వారు సమయం వృథా చేసుకోకుండా ఆన్‌లైన్‌లో చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది పక్షం రోజుల్లో అమల్లోకి రానున్నట్టు కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. సిబ్బందికి నేరుగా జరిమానా చెల్లించే అవకాశం లేకుండా చేసేందుకే ఈ విధానాలను రూపొందించారు.

ఇప్పుడిలా..
ప్రమాదకర డ్రైవింగ్, వన్‌వే ఉల్లంఘనలు, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి ఫొటోలను చిత్రీకరించి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో రోజుకు సగటున 500 ఈ-చలాన్లు జారీ అవుతున్నాయి. డ్రైవింగ్ లెసైన్స్, ఆర్‌సీ పుస్తకాలు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ తదితర నిబంధనలు ఉల్లంఘించే వారికి వెహికల్ చెక్ రిపోర్టు (వీసీఆర్) జారీ చేసి వాహనం సీజ్ చేసి మహిళా పోలీసు స్టేషన్ వద్దనున్న డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఇలా రోజుకు 150 వాహనాలు వస్తున్నాయి.

ఈ తరహా నిబంధనలు ఉల్లఘించే వారు ప్రస్తుతం బందరురోడ్డులోని కె.ఎస్.వ్యాస్ కాంప్లెక్స్‌లోని ట్రాఫిక్ కంట్రోల్ బూత్‌కి వెళ్లి అపరాధ రుసుం చెల్లించాలి. అక్కడి వరకు వెళ్లి క్యూలో నిలబడి ఈ-చలానా రుసుం చెల్లించాలంటే ఒకరోజు పని మానుకోవాలి. ఇది వీలుపడని స్థితిలో పదేపదే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి వాహనం సీజ్ చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇలా సీజ్ చేసిన వాహనానికి సంబంధించిన యజమాని విధిగా అక్కడికి వెళ్లి జరిమానా చెల్లించి బండిని విడిపించుకోవాల్సి వస్తోంది.  

ఆన్‌లైన్‌లో..
మరో పక్షం రోజుల్లో అమల్లోకి రానున్న ఆన్‌లైన్ విధానంలో వాహనదారులు సమయం వృథా కాకుండానే అపరాధ రుసుం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. నగర ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘనలపై ఈ-చలాన్ల జారీతో పాటు పోలీసు వెబ్‌సైట్‌లో కూడా ప్రదర్శిస్తున్నారు.  వెబ్‌సైట్‌లోని ఈ-చలానా విధానంలోకి వెళ్లి వాహనం నంబరు కొడితే నిబంధనల ఉల్లంఘన తెలిసిపోతుంది. ఆ పక్కనే జరిమానా చెల్లింపు (పేమెంట్) ఆప్షన్ పొందుపరుస్తున్నారు.

అక్కడ క్లిక్ చేస్తే నగదు చెల్లింపు విధానాలు ఉంటాయి. ఆన్‌లైన్, డెబిట్, క్రెడిట్ కార్డుల్లో దేనినైనా ఉపయోగించి జరిమానా చెల్లించొచ్చు. ఇందుకు నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు.   సీజ్ చేసినవాటికి కూడా ఈ విధంగానే జరిమానా చెల్లించి డంపింగ్ యార్డ్ నుంచి వాహనం సులువుగా పొందే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు