మంగళగిరి ఐటీ పార్కులో భారీ అగ్నిప్రమాదం

25 Feb, 2018 19:49 IST|Sakshi

రెండు ఐటీ కంపెనీల్లో మంటలు

కంప్యూటర్లు, ఫర్నిచర్‌ దగ్ధం, రూ.20 లక్షల ఆస్తి నష్టం

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం

గత నెలలో వీటిని ప్రారంభించిన ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌

సాక్షి, అమరావతి : మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్‌ఆర్టీ టెక్‌ పార్క్‌లో ఐటీ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ జనవరి, 17నే వీటిని ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఆర్టీ టెక్‌ పార్క్‌ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ పార్కింగ్‌ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫస్ట్‌ ఫ్లోర్‌లోని చార్వికెంట్‌ ఐటీ కంపెనీలోకి వ్యాపించిన మంటలు.. ఆ వెంటనే సెకండ్‌ ఫ్లోర్‌లోని అద్వైత ఐటీ కంపెనీకి వ్యాపించాయి.

చార్వికెంట్‌ ఐటీ కంపెనీకి చెందిన 12 కంప్యూటర్లు, ఫర్నిచర్‌ తదితర సామగ్రి దగ్ధంకాగా, అద్వైత ఐటీ కంపెనీని ఇటీవల ప్రారంభించడంతో పూర్తి స్థాయిలో కంప్యూటర్లు బిగించకపోవడంతో కొద్దిపాటి నష్టమే జరిగింది. ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి రావడం ఆలస్యంకావడంతో లోపల్నుంచి ఎగిసిపడుతున్న మంటల ఉధృతి తగ్గించేందుకు యువకుల సాయంతో పోలీసులు అద్దాలు పగులగొట్టించారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేయించారు. ఆదివారం అయినందున ఆయా కంపెనీల్లో సిబ్బంది లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై తమకు పూర్తి సమాచారం లేదని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు వ్యాపించాయా.. లేక ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తగలబెట్టారా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. భవనంలో సేఫ్టీ మెజర్స్‌ ఏ మాత్రం లేకున్నా నాయకుల ఒత్తిడి మేరకు అనుమతులు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు