సీసీఐ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

28 Jun, 2015 22:06 IST|Sakshi

వేటపాలెం (ప్రకాశం జిల్లా) : సీసీఐ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి కోట్ల విలువైన పత్తిబేళ్లు దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. మొత్తం ఆరు పెద్ద గోడౌన్లలో కాటన్ కార్పొరేషన్‌కు చెందిన 93 వేల పత్తి బేళ్లు నిల్వ ఉంచారు. ఒకటో నంబర్ గోడౌన్‌లో మూడు బ్లాకుల్లో దాదాపు 15 వేల పత్తిబేళ్లు నిల్వ ఉంచారు. ఒకటో నంబరు బ్లాకులో నిప్పు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. ఒకటో నంబరు బ్లాకులో నిల్వ ఉంచిన ఐదు వేల పత్తిబేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వీటి విలువ కోట్లు ఉంటుందని గోడౌన్ ఇన్‌చార్జ్ గిరీష్‌పాల్ తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. చీరాల, బాపట్ల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలు అదుపు చేస్తున్నాయి. జేసీ హరిజవహర్‌లాల్, తహశీల్దార్ కె.ఎల్.మహేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకరరావు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి అగ్నిప్రమాదానికి కారణాలను గోడౌను ఇన్‌చార్జిని అడిగి తెలుకున్నారు.

ప్రమాదంపై పలు అనుమానాలు...
ఈ ఏడాది మేనెల 7వ తేదీన సీసీఐ 6వ నంబర్ గోడౌన్‌లో రెండు బ్లాకుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో రెండు బ్లాకుల్లో నిల్వ ఉంచిన 11 వేల పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనిపై ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోడౌనుల్లో నిల్వ ఉంచిన పత్తి బేళ్లను వారం రోజులుగా లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. శనివారం ఆరు గోడౌనుల్లో నుంచి 12 వేల పత్తి బేళ్లను తరలించారు. ఒకటో నంబర్ గోడౌను రెండవ బ్లాకులోని 2 వేల పత్తి బేళ్లను రెండు లారీల ద్వారా తరలించారు. ఇంకా దాదాపు పది లారీలు గోడౌను వద్ద వచ్చి ఉన్నాయి. ఆదివారం కావడంతో కూలీలు రాక బేళ్ల తరలింపు ఆపివేశారు. ముందురోజు భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం ఒకటో నంబర్ గోడౌనులో నిప్పు అంటుకొని అగ్నిప్రమాదం సంభవించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిల్వ ఉంచిన గోడౌనుల్లో ఎటువంటి విద్యుత్ సరఫరా లేదు. షార్టు సర్క్యూట్ అయ్యే, గోడౌనులోకి నిప్పురవ్వలు వ్యాపించే అవకాశాలు లేవు. అయితే పత్తి బేళ్లకు నిప్పు ఏవిధంగా అంటుకుందో తెలియాల్సి ఉంది. ఎవరైనా కావాలని చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు