మహసింగిగూడలో ఎనిమిదిళ్లు దగ్ధం

18 Aug, 2013 04:18 IST|Sakshi

మహసింగిగూడ (కొత్తూరు), న్యూస్‌లైన్ :   మండలంలోని మహసింగిగూడ గిరిజన గూడలో శనివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగినపుడు అక్కడ గిరి జనులు లేకపోవడంతో ఇంట్లోని సామగ్రి పూర్తిగా బూడిదైంది. కట్టుబట్టలతో మిగిలిన గిరిజనులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కర్లెమ్మ పంచాయతీ పరిధి మహసింగిగూడ గిరిజన గూడలో శనివారం రాత్రి ఒకరి ఇంట్లో దినకార్యం జరిగింది. ఆ కార్యక్రమానికి గిరిజనులంతా వెళ్లారు. అందరూ అక్కడ ఉండగా ఇళ్లు కాలుతున్నాయని సమాచారం రావడంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే మంటలు ఎగసిపడుతుండడంతో ఇళ్లలో ఉన్న సామగ్రిని తీసుకోలేకపోయారు.
 
  ఈ ప్రమాదంలో సవర పెద్ద ముఖలింగం, సుందరావు, గోపి, తులసమ్మ, రాజారావు, ఎల్లంగో, ఆనంద్, బారికికి చెందిన పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. సర్టిఫికెట్లు, పట్టాలు, రేషన్‌కార్డులు, ఉపాధి కార్డులు, నగదు, బియ్యం, పాత్రలు, దుస్తులు, టీవీలు, కరెంట్ మీటర్లు, సైకిళ్లు కాలిపోయాయని గిరిజనులు తెలిపారు. కోళ్లు సజీవ దహనమయ్యాయి. ఏడాదికి సరిపోయిన ఆహార ధాన్యాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తహశీల్దార్ సూర్యనారాయణ గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. ప్రభుత్వ సాయం అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్‌ఐ భీమారావు, వీఆర్‌వో కృష్ణచంద్ర పట్నాయక్ ఉన్నారు.
 
  బాధితులకు పరామర్శ
 మహసింగిగూడ అగ్ని ప్రమాద బాధిత గిరిజనులను మాజీ ైవె స్ ఎంపీపీ లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు పరామర్శించారు. జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం గురించి ఐటీడీఏ పీవోకు తెలియజేసి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ పడాల వెంకటకృష్ణ, కర్నేన రామారావు  ఉన్నారు.

మరిన్ని వార్తలు