అగ్నిప్రమాదంలో ఒకరి సజీవదహనం

16 Jan, 2014 00:50 IST|Sakshi
ఫిరంగిపురం, న్యూస్‌లైన్ :విద్యుత్ షార్టుసర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధం కాగా, ఒకరు సజీవదహనమైన సంఘటన మండలకేంద్రంలోని కోనేటి చెరువుకట్ల ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.2.25 లక్షల నగదు సహా ఆరు లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. ఎస్‌ఐ పి.ఉదయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కోనేటి చెరువు కట్ట వద్ద తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన సుమారు 11 కుటుంబాలు ఐదేళ్లుగా నివాసం ఉంటున్నాయి. వీరంతా స్థానిక స్టోన్‌క్రషర్ క్వారీలో పనిచేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పలు కుటుంబాల వారితోపాటు పెరుమాళ్ల సేలా అనే మహిళ కూడా గుంటూరులో దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. 
 
 సేలా భర్త కన్నా ముదిరాజ్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ముదిరాజ్ ఉన్న గుడిసెకు నిప్పంటుకుంది. మిగిలిన పది గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ముదిరాజ్ సజీవదహనమయ్యాడు. స్థానికుల సమాచారంతో సత్తెనపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. గుడిసెల్లో ఐదు కేజీల మూడు గ్యాస్ సిలిండర్లు ఉండడం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని భావిస్తున్నారు. పండగ సందర్భంగా క్వారీ యజమాని నుంచి అడ్వాన్సుగా తీసుకున్న రూ.2.25 లక్షల నగదు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. మృతుడు  ముదిరాజ్ భార్య సేలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి, నరసరావుపేట రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు, ఎస్‌ఐ పి.ఉదయబాబు పరిశీలించారు.
 
 బాధితులకు పరామర్శ..
 కోనేటి చెరువు వద్ద జరిగిన అగ్ని ప్రమాద బాధితులను వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్ పరామర్శించారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల నగదు. మృతుడి కుటుంబానికి పది వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.  
 
మరిన్ని వార్తలు