కళ్ల ముందే కాలిపోయాయి

21 Nov, 2018 08:24 IST|Sakshi
అగ్నికి ఆహుతవుతున్న ఇళ్లు

కొంచాడలో భారీ అగ్ని ప్రమాదం

అగ్నికి ఆహుతైన పది ఇళ్లు

శ్రీకాకుళం, పొందూరు: మండలంలోని కొంచాడ గ్రామంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిం ది. ఈ ప్రమాదంలో నష్టపోయిన బాధితులంతా పేదవారే. కష్టపడి సంపాందించుకొన్న కొద్ది పాటి డబ్బు, బంగారం, దుస్తులు, సామాన్లు అగ్నికి ఆహుతి కావడంతో వారు కంటికిమింటికి ఏకధారగా రోదించారు.కొంచాడ గ్రామంలోని ప్రధాన వీధిలో మం గళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పది ఇళ్లు దగ్ధమయ్యాయి. ఉదయం ఏడు గంటలకే ఆయా కుటుంబాల వారంతా వరి కోత పనులకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇళ్లల్లో ఏ ఒక్కరూ లేకపోవడంతో మంటలను ఆప డం సాధ్యం కాలేదు. ఇళ్లపైన టార్పాలిన్లు కప్పి ఉంచటంతో మంటలు బయటకు వచ్చేందుకు సమయం పట్టింది. పదిళ్లు పూర్తిగా లోపల మండిపోయిన తర్వాత టార్పాలిన్లపై నుంచి పొగ రావ డం ప్రారంభమైంది. ఇది పరిశీలించిన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసి విఫ లమయ్యారు.

మంటలను ఆపడానికి దగ్గరకు వెళ్లి నా ఆపలేకపోయారు. స్థానికులు పొందూరు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించగా వారు వచ్చేలోపలే నష్టమంతా జరిగిపోయింది. బాధితులకు విషయం తెలిసి పరుగుపరుగున ఇళ్ల వద్దకు వచ్చే సరికి అంతా బూడిదైంది. కళ్ల ముందరే కష్టార్జితమంతా కాలిపోతుంటే వారంతా గుండెలవిసేలా రోదించారు. గండబాన రాంబాబు, అలబాన తవి టమ్మ, గడ్డెయ్య, పల్ల అప్నమ్మ, సింహాచలం, ఆదిలక్ష్మి, సూర్యనారాయణ, ముగడ గణపతి, దువ్వ సూరయ్య, చిన్ని సూరమ్మలకు చెందిన పదిళ్లు పూర్తిగా కాలిపోయాయి.
ఇళ్లలో దాచుకున్న కొద్దిపాటి వెండి, బంగారం, నగదు, దుస్తులు, సామాన్లు దగ్ధమైపోగా అధికారులు రూ.7 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. పల్ల ఆదిలక్ష్మికి చెందిన రూ. 40 వేలు నగదు, అరతులం బంగారం కాలిపోయాయి.

పలువురు విద్యార్థుల పదో తరగతి, ఇంటర్, ఐటీఐ సర్టిఫికెట్లు కూడా కాలిపోయాయి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంకు పుస్తకాలు, పట్టాదారు పాసు పుస్తకాలు వంటివీ బూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. తహసీల్దార్‌ దిలీప్‌ చక్రవర్తి, ఆర్‌ఐ ఈశ్వరరావులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు తక్షణ సాయం కింద బియ్యం అందించారు.

సర్వస్వం కోల్పోయాం
అగ్నిప్రమాదంతో మేం కట్టుబట్టలతో మిగిలాం. నా కొడుకు లక్ష్మణరావు పది, ఇంటర్, ఐటీఐ సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్‌ కార్డులు, బ్యాంకు పుస్తకం కాలిపోయాయి. రోజూ కూలి పని చేసుకొని బతుకుతున్నాం. తల దాచుకొనేందుకు సైతం గూడు లేకుండా పోయింది.– గండబాన రాంబాబు, బాధితుడు, కొంచాడ 

మరిన్ని వార్తలు