టింబర్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం

15 Jan, 2019 12:36 IST|Sakshi
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

రూ. 60 లక్షల మేర ఆస్తినష్టం

మంటలను ఆర్పేందుకు 5 గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏడీఎఫ్‌ఓ

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు అర్బన్‌ : పట్టణంలోని నెల్లూరురోడ్డులో గల ఓ టింబర్‌డిపోలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డిపోలోని రూ.60 లక్షలు విలువ చేసే టేకు సామగ్రి దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని అగ్నిమాపకశాఖ ఏడీఎఫ్‌ఓ డి.యేసురత్నం పరిశీలించారు. స్థానిక నెల్లూరురోడ్డులో జయసుబ్బారెడ్డి అనే వ్యక్తి కొన్నేళ్లుగా టింబర్‌డిపో నిర్వహిస్తున్నారు. చెన్నై, ఇతర ప్రాంతాల నుంచి టేకు చెట్లను కొనుగోలు చేసి ఇంటి సామగ్రిగా తయారు చేసి విక్రయిస్తుంటాడు. రోజూ మాదిరే ఆదివారం రాత్రి డిపోను మూసివేసి ఇంటికెళ్లిన తర్వాత సోమవారం తెల్లవారుజామున 1–30 గంటల సమయంలో టింబర్‌డిపోలో మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు ఫోన్‌లో తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ చిన్నయ్య సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయితే మంటలు ఒక గది నుంచి మరొక గదికి వ్యాపించి భారీగా చెలరేగడంతో జిల్లాస్థాయి అధికారులకు తెలిపారు. వెంటనే వారు మైదుకూరు అగ్నిమాపక సిబ్బందిని కూడా ఘటనా స్థలానికి పంపించారు. వారు వచ్చేలోపు మూడు రౌండ్లు నీటిని కొట్టడంతో మంటలు కొద్దిగా తగ్గాయి. ఆ తర్వాత బద్వేలు, మైదుకూరు ఫైరింజన్లు 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

రూ.60 లక్షలు ఆస్తి నష్టం     
టింబర్‌ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.60 లక్షల మేర నష్టం వాటిల్లి ఉంటుందని టింబర్‌ డిపో యజమాని అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఇటీవలే రూ.1.20 కోట్ల టేకు మొద్దులను కొనుగోలు చేసి సామానుగా తయారు చేయించి డిపోలో భద్రపరిచామని, కొద్ది సరుకు అమ్ముడుపోగా రెండు గదుల్లోని సామగ్రి మొత్తం దగ్ధమైందని తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏడీఎఫ్‌ఓ
 టింబర్‌డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని తెలుసుకున్న కడప ఏడీఎఫ్‌ఓ యేసురత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండు గదుల్లో దగ్ధమైన టేకు సామగ్రిని పరిశీలించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. చివరకు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. అలాగే ప్రమాదంలో ఎంత నష్టం సంభవించిందనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నష్టం అంచనా వేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు