ప్రాణ భయంతో పరుగులు

9 Apr, 2019 13:14 IST|Sakshi
సంఘటన స్థలంలో పరిశ్రమ సిబ్బందితో మాట్లాడుతున్న కన్నబాబు

ఏషియన్‌ పెయింట్స్‌లో అగ్ని ప్రమాదం

వణికిపోయిన కార్మికులు

భీతిల్లిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు

రాంబిల్లి(యలమంచిలి): మధ్యాహ్నం రెండు గంటలు... అంతవరకు పనిచేసిన కార్మికులందరూ భోజనాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ముగించారు. అంతలో భారీగా పేలిన శబ్దాలు...ఏమైందోనని చూసేలోపే దూరంగా భీకరంగా పైకి ఎగసిపడుతున్న మంటలు... అరుపులు ...కేకలు...ప్రాణభయంతో పరుగులు తీస్తున్న కార్మికులు... నోటిలో ముద్ద పెట్టుకోకుండానే ఎలా ఉన్న వారు అలాగే పరుగు లంఘించుకున్నారు.

రాంబిల్లి మండలం పూడి వద్ద గల ఏషియన్‌ పెయింట్స్‌ పరిశ్రమలో సోమవారం అగ్నిప్రమాదం జరగడంతో  ఉద్యోగులు, కార్మికులు ప్రాణభయంతో వణికిపోయారు.    దట్టంగా పొగ, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మూడునెలల క్రితం ఏíషియన్‌ పెయింట్‌ నిర్మాణం పూర్తిచేసుకొని ఉత్పత్తులను ప్రారంభించింది.   పెయింట్స్‌ తయారీకి వినియోగించే మోనోమార్‌ కెమికల్‌ నిల్వచేసే ట్యాంకులకు సోమవారం నిప్పు అంటుంది. ట్యాంకులకు సమీ పంలో ఉన్న బ్రాయిలర్‌ నుంచి మంటలు వ్యాపించి  కెమికల్‌ ట్యాంకునకు వ్యాపించింది. ప్రమాదంలో రెండు పెద్ద ట్యాంకులు పూర్తిగా ఆకారం మారిపోయేలా కాలిపోయాయి. ట్యాంకు మూత ఎగిరి పక్కన పడింది.

కెమికల్‌ ద్రావణం నల్లని దట్టమైన పొగను విరజిమ్ముతూ మంట ఎగసిపడింది. ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో  కార్మికులు ఒక్కసారిగా గేటువద్దకు పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. లారస్‌ పరిశ్రమలో అగ్నిమాపక యంత్రం మొదట సంఘటన స్థలానికి చేరుకుంది. ఏపీఐఐసీ వద్ద గల మరో అగ్నిమాపక యంత్రం వచ్చి  గ్యాస్‌ను వినియోగించి మంటలను అదుపుచేశారు. వివిధ ప్రాం తాల నుంచి 12 అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలాన్నిచేరుకున్నాయి.15అంబులెన్స్‌లను రప్పిం చా రు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం తెలియజేసింది. మంటలను పూర్తిగా అదుపుచేయడంతో కార్మికులు, చుట్టుపక్కల గ్రామా ల ప్రజలు ఊపిరి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నట్టు అగ్నిమాపకఅధికారి డి.వి.ఎస్‌.రాంప్రకాష్‌ చెప్పారు.

యాజమాన్యం తీరుపై అనుమానాలు  : ప్రమాదం జరిగిన తరువాత  రెండు అంబులెన్స్‌లు పరిశ్రమనుంచి బయటకువెళ్లాయి.  ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని యానమాన్యం ప్రకటించ డం, మీడియాను సంఘటన స్థలానికి అనుమతించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

నిర్మాణం పూర్తి చేసుకోకుండానే... : పరిశ్రమలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేయకుండానే ఉత్పత్తిని ప్రారంభించింది. పరిశ్రమలో పూర్తిస్థాయిలో వసతులు ఏర్పాటు కాలేదు  ఏషియన్‌ పెయింట్స్‌ పరిశ్రమ అత్యంతకాలుష్యభరిత పరిశ్రమ జాబితాలో ఉంది. రెడ్‌జోన్‌ పరిశ్రమ కేటగిరీలో పెయింట్స్‌ పరిశ్రమను ఉంచారు. పరిశ్రమకు ప్రత్యేకంగా అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలి. రెండుకు మించి అంబులెన్స్‌లు ఉండాలి. పరిశ్రమ చుట్టూ అగ్నిమాపక యంత్రాలు వెళ్లడానికి వీలుగా రోడ్లు ఉండాలి. పరిశ్రమ ఇంకా నిర్మాణ దశలో ఉండడంతో  పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటుM >లేదని కార్మికులు చెబుతున్నారు.

సంఘటన స్థలాన్ని సందర్శించిన కన్నబాబు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యు.వి. రమణమూర్తిరాజు (కన్నబాబు) సందర్శించారు. కార్మికులకు ధైర్యం చెప్పా రు. కార్మికుల యోగక్షేమాలపై యాజమాన్యంతో మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి నష్టంజరిగినా పూ ర్తి సహాయం అందించాలని తెలిపారు. టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు, జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కూండ్రపు అప్పారావు, ప్రగడ నాగేశ్వరరావు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. సీఐ విజయనాథ్, ఎస్‌ఐ చక్రధరరావులు పరిస్థితిని సమీక్షించి విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు