అడవిలో మంటలు.!

4 Mar, 2019 12:26 IST|Sakshi
నిప్పు పెట్టడంతో అడవిలో వ్యాపిస్తున్న మంటలు

వేసవికి ముందే అటవీ

ప్రాంతంలో అగ్నిప్రమాదాలు

ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా టెక్నాలజి ద్వారా గుర్తింపు

ఫైర్‌ వాచర్లతో నిత్యం పర్యవేక్షణ

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : వేసవి సమీపిస్తుందంటే చాలు అటవీప్రాంతంలో సంచరిస్తున్న పక్షులు, జంతువుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. పచ్చటి చెట్లతో కళకళలాడాల్సిన అడవులు నల్లగా మసిబారిపోతున్నాయి. మనిషి చెలగాటం జంతువులకు ప్రాణసంకటంగా మారింది. కొందరి నిర్లక్ష్యం ఎన్నో పక్షు జాతులకు ప్రమాదంగా మారింది. వృక్షాలు, సీజనల్‌ పండ్ల మొక్కలు, విలువైన మూలికలు కాలి బూడిద అవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తరచు నిప్పు పెడుతుండటంతో వందల హెక్టార్లలో అడవి అగ్నికి  ఆహుతి అవుతోంది. సాధారణంగా వేసవి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ ఏడాది వేసవి రాకముందే అడవులు తగలబడి పోతున్నాయి. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్‌ 5 రేంజ్‌ల పరిధిలో 1 లక్షా 65 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది.

బోద గడ్డితోనే అగ్నిప్రమాదాలు..
అడవుల్లో బోదగడ్డి విస్తారంగా ఉంటుంది. వేసవి వచ్చేసరికి గడ్డి పూర్తిగా ఎండిపోతుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో బోద కొట్టాలు ఉండటంతో ఈ గడ్డికి బాగా డిమాండు ఉండేది. దీంతో అటవీ సమీప గ్రామ ప్రజలు అడవుల్లోకి వెళ్లి గడ్డిని కోసుకొని విక్రయించేవారు. అయితే ఇప్పుడు కొట్టాల స్థానంలో మిద్దెలు రావడంతో బోదగడ్డికి డిమాండు తగ్గింది. అక్కడక్కడా గుడిసెలు ఉన్నా గతంలో మాదిరి ఇప్పుడు అడవుల్లోకి వెళ్లేవారు కరువయ్యారు. అటవీ, పోలీసు శాఖ ఆంక్షల మధ్య వెళ్లాలంటే కూలీలు జంకే పరిస్థితి ఏర్పడింది. విలువైన ఎర్రచందనం కోసం తమిళ కూలీలు, ఈ ప్రాంతానికి చెందిన స్మగ్లర్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇతరులు అడవుల్లో సంచరించడాన్ని పూర్తిగా నిషేధించారు. అయినా పశువుల కాపర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లో సంచరిస్తూ బోదగడ్డికి నిప్పు పెడుతున్నారు. దీంతో వందల ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలి బూడిదవుతోంది. అనేక వృక్ష, జంతు, పక్షి జాతులు కూడా మృత్యువాత పడుతున్నాయి. కాగా ప్రొద్దుటూరు అటవీ డివిజన్‌ పరిధిలో సంభవించిన అగ్నిప్రమాదాల్లో ఇటీవల కాలంలో వన్యప్రాణులు చనిపోయిన  దాఖలాలు లేవని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

డెహ్రాడూన్‌ టెక్నాలజీతోఅగ్నిప్రమాదాల గుర్తింపు
ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డెహ్రాడూన్‌ రూపొందిం చిన నూతన టెక్నాలజి ద్వారా అడవుల్లో జరిగిన అ గ్నిప్రమాదాలను క్షణాల్లోనే గుర్తిస్తున్నారు. ఎస్‌ఎన్‌పీపీ శాటిలైట్, మోడీస్‌ శాటిలైట్‌ల ద్వారా అడవుల్లో ఎక్కడ మంటలు కనిపించినా ఆ ప్రాంతాన్ని సూచి స్తూ ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డెహ్రాడూన్‌ సంస్థకు ఏరియాను తెలిపే మ్యాప్‌ వెళ్తుంది. ఈ సమాచారాన్ని ఆయా రాష్ట్రాల అటవీశాఖలకు క్షణాల్లోనే చేరవేస్తారు. 5–6 నిమిషాల్లోపే డీఎఫ్‌ఓలకు, క్షేత్రస్థాయిలో ఉన్న అటవీ సిబ్బంది, ఫైర్‌ వాచర్ల మొబైల్‌ ఫోన్లకు ఏరియాను సూచించే మ్యాప్‌ను పంపిస్తారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేస్తారు. వారు వెళ్లేలోపు కొంత భాగం అటవీ ప్రాంతం కాలిపోయినా మిగతా భాగం కాలకుండా వీరు చర్యలు తీసుకుంటారు.  375 చదరపు మీటర్లు కాలిపోయిన ప్రాంతాన్ని ఒక పాయింట్‌గా లెక్కిస్తారు.

అగ్నిప్రమాద నివారణా చర్యలు..
ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్‌ పరిధిలో అగ్నిప్రమాదాల నివారణకు రేంజ్‌కు 9 మంది చొప్పన 45 మంది ఫైర్‌ వాచర్లు పని చేస్తుంటారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్‌ నుంచి మే నెలాఖరు వరకు వీరు అప్రమత్తంగా ఉండేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడానికి బ్లోయర్లు, గ్రాస్‌కట్టర్లు, ఫైర్‌ ఎక్స్‌టింగ్యూస్, ట్యాంకర్లను సిద్ధం చేశారు. ఫైర్‌ వాచర్లకు యూనిఫాం, హెడ్‌ల్యాంప్, టార్చ్, ఇందుకోసం ప్రతి ఏడాది (క్యాంపా) కేంద్ర నిధులను వెచ్చిస్తున్నారు. అటవీ సమీప గ్రామాల్లో అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలను పంచడం, వాల్‌ పోస్టర్లను గోడలకు అంటించడంతో పాటు అగ్గి రాజేసే పరికరాలను అడవుల్లోకి తీసుకెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కళాజాత, నాటకాల రూపంలో అడవికి నిప్పు పెట్టడం వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తున్నారు.  

చర్యలు తీసుకుంటున్నాం
అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటున్నాం. ఫారెస్ట్‌ రేంజర్లు, బీట్‌ ఆఫీసర్లతో పాటు ఫైర్‌ వాచర్లను అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేస్తున్నాం. అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాం. – గురుప్రభాకర్, డీఎఫ్‌ఓ, ప్రొద్దుటూరు డివిజన్‌.

మరిన్ని వార్తలు