వరుస ప్రమాదాలతో ఉక్కురిబిక్కిరి

22 Jan, 2019 08:08 IST|Sakshi
స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నెస్‌ –3లో అగ్ని ప్రమాదంతో ఎగసిపడుతున్న మంటలు (ఫైల్‌)

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కోట్లలో నష్టాలు

నిర్వహణ లోపాలతోనే ప్రమాదాలు

విస్తరణ యూనిట్లలోనే ఈ సమస్య

తాజాగా ఎస్‌ఎంఎస్‌–2లో ప్రమాదం

విశాఖపట్టణం: వరుస ప్రమాదాలతో స్టీల్‌ప్లాంట్‌ ఉక్కురిబిక్కిరి అవుతున్నది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్రమాదం నుంచి తేరుకోకముందే సోమవారం తెల్లవారి ఎస్‌ఎంఎస్‌ – 2లో ఫిల్టర్‌ ప్రెస్‌ బిల్డింగ్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదాల వల్ల ప్లాంట్‌కు కోట్లాది రూపాయల ఉత్పత్తి నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవిస్తున్నది. దీంతో ఉద్యోగులు ఏ రోజు ఏ విభాగంలో ప్రమాదం జరగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఎస్‌ఎంఎస్‌ –2లో మరో ప్రమాదం సంభవించింది. స్టీల్‌మెల్ట్‌షాప్‌లోని కన్వర్టర్‌లో ముడి సరుకును బ్లో చేయగా అందులో మిగిలిన వ్యర్థాల్లో గ్యాస్‌ను పైకి పంపగా డస్ట్‌ తదితరాలు గ్యాస్‌ క్లీనింగ్‌ ప్లాంట్‌ నుంచి కన్వేయర్‌ ద్వారా ఫిల్టర్‌ ప్రెస్‌ బిల్డింగ్‌కు పంపుతారు. ఈ క్రమంలో ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుండగా సోమవారం తెల్లవారి 2.30 గంటల ప్రాంతంలో ఫిల్టర్‌ ప్రెస్‌ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. అక్కడే గేర్‌ బాక్సులు ఉండటంతో ఆయిల్‌ తగిలి మంటలు ఎగిసిపడ్డాయి.

మంటలు ఫిల్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు వ్యాపించడంతో అక్కడ ఉన్న కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ విభాగానికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రెస్‌ బిల్డింగ్‌లోని మోటార్లు, గేరు బాక్సులు, కేబుళ్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో విభాగం ఫిల్టర్‌ ప్రెస్‌ పనులను ఎస్‌.ఎం.ఎస్‌ – 1 విభాగానికి చెందిన ఫిల్టర్‌ ప్రెస్‌కు బైపాస్‌ చేశారు. ఈ సంఘటనపై ఎస్‌.ఎం.ఎస్‌ – 2, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం అధికారులు తమది కాదంటే తమది కాదని ఒకరిపై మరొకరు నెట్టుకుని సమాచారాన్ని ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించారు. సరైన మెయింటెనెన్స్‌ లేకపోవడంతో కన్వేయర్‌కు రబ్‌ అయ్యి మంటలు చెలరేగాయా లేదా షార్ట్‌ సర్క్యూట్‌ అయి ఉంటుందా అని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇది మరలా ప్రారంభించడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.  అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో కూడా ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంలో సుమారు రూ.2 కోట్లు విలువైన ఆస్తి నష్టం జరిగినట్టు కార్మిక వర్గాల సమాచారం.

విస్తరణ యూనిట్లలో ఎక్కువ ప్రమాదాలు
ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే విస్తరణ యూనిట్లలో ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో సింటర్‌ ప్లాంట్‌ – 2, ఆర్‌ఎంహెచ్‌పీలలో మెయింటెనెన్స్‌ సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యాయి. గత వారంలో బీఎఫ్‌ – 2, నాలుగు రోజుల క్రితం బీఎఫ్‌ – 3, ప్రస్తుతం ఎస్‌.ఎం.ఎస్‌ – 2లో జరిగిన ప్రమాదాలు విస్తరణ యూనిట్లలో మెయింటెనెన్స్‌ నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయి.

ఉన్నధికారుల మధ్య సమన్వయలోపం
ప్లాంట్‌లోని విభాగాల్లో ఉండే ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం కూడా ప్రమాదాలకు మరో కారణమనే ఆరోపణలున్నాయి. వీరి మధ్య సీనియర్, జూనియర్‌ అన్న భేదాలు, పదోన్నతులు వంటి వివిధ అంశాల వల్ల తమ విధులను నిర్లక్ష్యం చేయడంతో పాటు కాంట్రాక్టర్లను నియంత్రించడంలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి కారణంగా విభాగాల మెయింటెనెన్స్‌ కుంటుపుడుతునన్నది బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంట్రాక్టర్ల చేతిలో మెయింటెనెన్స్‌ వల్లే స్టీల్‌ప్లాంట్‌ మొదటి దశ ఆపరేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ పనులు పర్మినెంట్‌ ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. అయితే విస్తరణ యూనిట్లలో కేవలం ఆపరేషన్‌ పనులు మాత్రమే పర్మినెంట్‌ ఉద్యోగలు చేస్తారు. మెకానికల్, ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌ పనులు పూర్తిగా కాంట్రాక్టర్లుకు అప్పగించారు. దీంతో ఆయా కాంట్రాక్టర్లు తమ దగ్గర ఉన్న పోస్టులను రూ.3 నుంచి రూ.6 లక్షలకు అమ్ముకోవడం స్టీల్‌ప్లాంట్‌లో నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నూతనంగా చేరిన జూనియర్‌ ఉద్యోగులను విస్తరణ యూనిట్లలో నియమించడం వల్ల వారు కూడా అనుభవ లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా కాంట్రాక్టర్లకు డబ్బే పరమావధి కావడంతో కాంట్రాక్ట్‌ సిబ్బందిలో నైపుణ్యత, అనుభవం కొరవడి యంత్రాల మెయింటెనెన్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ల తీరు
స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. వారు చేసే పనులపై సరైన పర్యవేక్షణ లేకుండా, పైపై పనులు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతున్నది.
 – బి.అప్పారావు,సీఐటీయూ నాయకులు

మరిన్ని వార్తలు