టపాసుల దందాలో.. ఫైర్‌ అధికారులకు సపరేటు!

9 Oct, 2019 07:40 IST|Sakshi
జిల్లా అగ్నిమాపకశాఖ కార్యాలయం 

పండగ వేళ ఒక్కో షాపు నుంచి  రూ. 5వేలు వసూలు 

గతేడాది 123 షాపుల నుంచి వచ్చిన అక్రమ ఆదాయం రూ.6.15 లక్షలు  

సాధారణ సమయంలో గంపగుత్తగా మామూళ్లు 

జనావాసాల మధ్య యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నా పట్టించుకోని వైనం  

సాక్షి,అనంతపురం : అనంతపురంలోని తిలక్‌రోడ్డులో ఈ నెల 3న వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఐ సాగర్‌ ఆధ్వర్యంలో పలు షాపుపై దాడులు నిర్వహించారు. నందకిశోర్‌ అనే వ్యక్తి కిరాణాషాపులో టపాసులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రూ. 62వేలు విలువ జేసే టపాసులు సీజ్‌ చేశారు. సదరు దుకాణం రద్దీ ప్రాంతంలోనే కాకుండా ఇళ్ల మద్య ఉంది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిన చుట్టూ నాలుగైదు ఇళ్లకు ప్రభావం చూపే అవకాశముంది. గతేడాది దీపావళి పండగకు జిల్లా కేంద్రంలో దాదాపు 123 షాపులు ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి 185 దరఖాస్తులు వచ్చినా కొంతమంది తప్పుకోవడంతో 123 మంది ముందుకువచ్చారు. వీరు షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అగ్నిమాపకశాఖ అధికారులకు ఒక్కొక్కరు రూ. 5వేలు ముట్టజెప్పుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన గతేడాది అగ్నిమాపకశాఖ అధికారులకు మూడు రోజుల షాపులకు రూ.6.15 లక్షల అక్రమ ఆదాయం పొందారు. గతేడాది మాత్రమే కాదు కొన్నేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఈసారి రూ. 5వేలు ‘రేటు’ పెంచాలనే యోచనలో ఆ శాఖ ఉన్నట్లు సమాచారం.

అనంతపురం సెంట్రల్‌: టపా(కా)సులదందాలో  ప్రతి ప్రభుత్వశాఖకూ ఉన్నట్లుగానే అగ్నిమాపకశాఖ అధికారులకూ ఓ రేటు ఉంది. వారి ముడుపులు వారికి ముట్టిన తర్వాతనే టపాసుల వ్యాపారానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది. అయితే రెవెన్యూ, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు ముందు వరుసలో ఉండగా అగ్నిమాపకశాఖ అధికారులు మాత్రం చివరి వరుసలో ఉంటారు. అంతే తప్ప మిగతా దందా సేమ్‌ టూ సేమ్‌. జిల్లాలో ప్రతి ఏటా సాగుతున్న రూ.వందల కోట్ల చీకటి వ్యాపారం పేదల్లో ఏమో కానీ అధికారుల జీవితాల్లో మాత్రం వెలుగులు నింపుతోంది. అక్రమ వ్యాపారాన్ని సక్రమం చేసే పనిలో భాగంగా భాగస్వామ్య ప్రభుత్వశాఖలకు ముడుపులు భారీగా ముడుతున్నాయి. ఇందులో సింహభాగం కమర్షియల్‌ ట్యాక్స్, రెవెన్యూ శాఖలకు వెళ్తుండగా చివరిలో అగ్నిమాపకశాఖ అధికారులు తమ వాటా లెక్కలేసుకొని మరీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.  

నింబంధనల ఉల్లంఘనలకే వాటాలు  
ప్రతి వ్యాపారంలోనూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన తర్వాతనే లావాదేవీలు ప్రారంభించాలి. కానీ టపాసుల వ్యాపారం మొత్తం ‘జీరో’తో మొదలవుతోంది. తమిళనాడులో శివకాశి నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా జిల్లాకు అక్రమ మార్గంలో తీసుకొస్తున్నారు. ఆదివారం టీఎన్‌–67 ఏబీ 1103 లారీలో తమిళనాడు నుంచి అక్రమంగా (ఎలాంటి బిల్లులు లేకుండా) ధర్మవరం, ముదిగుబ్బ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.50 లక్షలకు పైగా విలువైన టపాసులు తీసుకొస్తుండగా ధర్మవరం పోలీసులకు పట్టుబడ్డారు. ప్రభుత్వానికి టోకరా వేసి టపాసులు ఏ విధంగా జిల్లాకు వస్తాయని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. వాస్తవానికి ఇలాంటి వాటిపై కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు దృష్టి పెట్టాలి. అయితే జిల్లాలో టపాసుల వ్యాపారం ఎవరు చేస్తారు? ఎక్కడ నిల్వ ఉంచుతారు అనే విషయాలు అన్ని తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వారిపై వినిపిస్తున్నాయి. తిరిగి వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించే సమయంలో సదరు అధికారులకు  భారీగా ముడుపులు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. 

మామూళ్లకు తలొగ్గి అనుమతులు 
సాధారణంగా టపాసులను ఊరి బయట నిల్వ ఉంచాలి. అయితే నిర్మానుష్య ప్రదేశంలో టపాసుల గోడౌన్‌ ఏర్పాటు చేస్తే అందరికీ తెలిసే అవకాశముంది. దీంతో ఎక్కువశాతం పట్టణ ప్రాంతాల్లో జనావాసాల మధ్యనే నిల్వ ఉంచుతున్నారు. నగరంలో తిలక్‌రోడ్డులో నందకుమార్‌ అనే వ్యక్తి రూ.లక్షలు విలువ జేసే సరుకును నిల్వ ఉంచుకొనడంతో పాటు విక్రయాలు చేస్తున్నా అగ్నిమాపకశాఖ అధికారులకు కనీస సమాచారం లేదు. జనసంచార ప్రాంతాల్లో నిల్వ ఉంచితే చర్యలు తీసుకోవాల్సింది అగ్నిమాపకశాఖ అధికారులే. కానీ ఇవేమీ పట్టించుకోకుండా అగ్నిమాపకశాఖ అధికారులు ఉన్నారంటే ఏ స్థాయిలో ముడుపులు వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీపావళి పండుగ రోజు ఏర్పాటు చేసే దుకాణాల వద్ద ఏ మాత్రం నిబంధనలు పాటించకపోయినా మామూళ్లకు తలొగ్గి అనుమతులు మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి ఒక షాపు నుంచి మరో షాప్‌కు మధ్య కనీసం 10 అడుగులు దూరం ఉండాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే ఆర్పి వేసేందుకు డ్రమ్ములో సిద్ధంగా నీళ్లు, ఇసుక, ఫైర్‌ సేఫ్టీ పరికరాలు అందుబాటు ఉంచుకోవాలి. ఇవేమీ ‘అనంత’లో కనిపించవు. తిరుణాళ్లలో అంగళ్ల తరహాలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఒకషాపులో ప్రమాదం జరిగిదే మొత్తం కాలిపోయే ప్రమాదముంది. ఈ నిబంధనలను తుంగలోకి తొక్కేందుకు వ్యాపారస్తులు ముందే ముడపులు ముట్టజెప్పుతుండడంతో  అగ్నిమాపకశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.    

మరిన్ని వార్తలు