రెస్క్యూ ఆపరేషన్‌కు దారితీసిన బుడ్డోడి ఆట..!

23 Aug, 2019 17:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : పిల్లలు చేసే అల్లరితో తలప్రాణం.. తోకకొచ్చింది అని కుటుంబ సభ్యులు విసుక్కుంటుంటారు. అయితే, పద్నాలుగు నెలల వయసున్న ఓ బుడతడు చేసిన పనికి అటు తల్లి దండ్రులు, ఇటు కాలనీ వాసులు, ఒక రకంగా ఆ ఊరుఊరంతా టెన్షన్‌ పడ్డారు. ఊహించని పరిణామంతో ఇంట్లో ‘బందీ’లైన తల్లీ, కొడుకు అగ్నిమాపక సిబ్బంది సాయంతో బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగింది. వివరాలు.. అనకాపల్లి పట్టణంలోని చవితి వీధిలో గల ఆర్కే అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్థులో ఓ కుంటుంబం నివాసముంటోంది. తల్లి వంట గదిలో ఉండగా.. 14 నెలల పిల్లోడు ఆ గదికి బయట గడియ పెట్టి ఆడుకుంటున్నాడు. అదేక్రమంలో ఇంకో గదిలోకి వెళ్లాడు.

అయితే, అకస్మాత్తుగా ఆ రూమ్‌ డోర్‌ లాక్‌ అయింది. దీంతో బిడ్డా, తల్లి వేర్వేరు గదుల్లో చిక్కుకు పోయారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో తల్లి కేకలు, పిల్లవాని ఏడుపుతో పక్క ప్లాట్లలోని వారికి విషయం తెలిసింది. వారు చిక్కుకు పోయిన ఫ్లాట్‌ మెయిన్‌ గేట్‌ కూడా లాక్‌ చేసి ఉండటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. తాడు సాయంతో అపార్ట్‌మెంట్‌పై నుంచి ప్లాట్‌ లోనికి ప్రవేశించిన సిబ్బంది లాక్ ఓపెన్ చేసి పిల్లవాడిని, తల్లిని కాపాడారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్‌ఎంఎల్‌ కింగ్, స్థానిక అగ్నిమాపక అధికారి ఆర్‌.వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది కృష్ణప్రసాద్, మదిన, గణేష్, నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బందిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

>
మరిన్ని వార్తలు