సినిమా హాళ్లలో నామ్‌కే వాస్తేగా అగ్నిమాపక చర్యలు

1 Sep, 2018 12:37 IST|Sakshi

సినిమా హాళ్లలో నామ్‌కే వాస్తేగా అగ్నిమాపక చర్యలు  

అలంకారప్రాయంగా  అగ్నిమాపక పరికరాలు  

జాడలేని వాటర్‌ ట్యాంకులు   

రాజమండ్రిలో రంభాఊర్వశీ థియేటర్‌లో శుక్రవారం మధ్యాహ్నం మ్యాట్నీ సినిమా సాగుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రేక్షకులు ప్రాణభయంతో థియేటర్‌ నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం, జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లలో భద్రత ఎంత? అనే ప్రశ్న ప్రజల మెదళ్లను తొలిచేస్తోంది. అగ్నిప్రమాదాల నివారణ, రక్షణ చర్యల్లో డొల్లతనం గుర్తువచ్చి చెమటలు పట్టిస్తోంది.

విజయవాడ : రాజధాని ప్రాంతంగా భాసిల్లుతున్న విజయవాడ నగరంలో, జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లలో ఫైర్‌సేఫ్టీపై మొక్కుబడితనం భయంపుట్టిస్తోంది. పలు సినిమా థియేటర్లలో నిర్వాహకులు ప్రధానంగా అగ్నిప్రమాద నివారణకు సంబంధించి నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కొన్ని థియేటర్లలో అగ్నిప్రమాద నివారణ పరికరాలు అలంకారప్రాయంగా మారాయి. అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులిపేసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ప్రజలు బాహాటంగానే దుమ్మెత్తిపోస్తున్నారు. కొన్ని థియేటర్లలో ఎప్పుడో ఏర్పాటు చేసిన అగ్నిప్రమాద నిరోధక పరికరాలు మూలనపడ్డాయి. విజయవాడ నగరంలో 5 మల్టీప్లెక్స్‌లు, దాదాపు 35 వరకు సినిమా థియేటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్యమైన మండల కేంద్రాల్లో దాదాపు మరో 70 వరకు సినిమా హాళ్లు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇలా మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 110 వరకు అన్ని రకాల థియేటర్లలో ప్రతి నిత్యం వేలాది మంది ప్రేక్షకులు సినిమాలు చూస్తుంటారు. అయితే ఈ థియేటర్లలో అగ్ని ప్రమాద నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. అగ్నిమాపక పరికరాలు కొన్నిచోట్ల ఉన్నా అవి సక్రమంగా పనిచేయడం లేదు. వాటర్‌ ట్యాంకులు, పైప్‌లైన్లు శిథిలావస్థకు చేరాయి.

నిబంధనల మేరకు ప్రేక్షకుల కెపాసిటీని బట్టి థియేటర్ల పైభాగంలో వాటర్‌ ట్యాంకులు, అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంకులు, పైప్‌లైన్లు, విద్యుత్, డీజిల్‌ మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వీటి జాడ ఏ ఒక్క థియేటర్లలో కనిపించడంలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే స్ప్రే ద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ను వదులుతూ ప్రేక్షకులను బయటకు పంపే విధంగా ట్యూబ్‌లు ఏర్పాటు చేయాలి. అటువంటి పరికరాలు 70 శాతంపైగా థియేటర్లలో కనిపించడంలేదని తెలుస్తోంది. థియేటర్లలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రేక్షకులకు ఎటువంటి ఆపద కలుగకుండా రూపొందించిన సినిమాటోగ్రఫీ యాక్ట్‌లోని పలు నిబంధనలను పట్టించుకున్న నాథుడే లేరు. 

సినిమాటోగ్రఫీ యాక్టు ప్రకారం ఫైర్‌సేఫ్టీ నిబంధనలు ఇవే..
ప్రతి థియేటర్‌లో కార్బన్‌డయాక్సైడ్‌తో కూడిన పరికరాలు ఉండాలి
హాస్‌ రీల్‌ అమర్చాలి. అంటే కార్బన్‌డయాక్సైడ్‌తో ఉన్న ట్యూబ్‌లు సినిమా థియేటర్‌ గోడలకు అమర్చి ఉండాలి.  
ప్రమాదం జరిగినప్పుడు ప్రేక్షకులను అప్రమత్తం చేసేందుకు ఆటోమేటిక్, మాన్యువల్‌ అలారం ఏర్పాటు చేయాలి.    
10 మీటర్ల ఎత్తుకంటే తక్కువ ఉన్న టూరింగ్‌ టాకీస్‌లో కూడా కనీసం 10 వేల లీటర్ల ట్యాంకు థియేటర్‌ టాప్‌పై ఉండాలి.  
10 మీటర్లకంటే ఎత్తు ఎక్కువ ఉన్న థియేటర్లపై కనీసం 450 ఎల్‌పీఎం కెపాసిటీతో ఎలక్ట్రికల్‌ పంపు ఏర్పాటు చేయాలి.
300 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు కూర్చొని సినిమా వీక్షించే వీలుండే థియేటర్లలో 15 వేల లీటర్ల ట్యాంకు, 900 ఎల్‌పీఎం కెపాసిటీగల ఎలక్ట్రికల్‌ పంపు ఉండాలి.
10 నుంచి 15 మీటర్ల ఎత్తుగల థియేటర్లలో 50 వేల అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ స్టోరేజీ   ఉండాలి. ఒక ఎలక్ట్రికల్, ఒక డిజిల్‌ పంపు అందుబాటులో ఉండాలి.
15 నుంచి 24 మీటర్ల ఎత్తుగల థియేటర్లలో  75 వేల లీటర్ల అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ స్టోరేజీ ఉండాలి. థియేటర్‌ పైభాగంలో 25 వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్‌ ట్యాంకులు ఉండాలి.
24 నుంచి 30 మీటర్లు ఆపై ఎత్తు ఉన్న థియేటర్లలో లక్ష లీటర్ల అండర్‌ గ్రౌండ్‌ ట్యాంకు, టెర్రస్‌పై 25 వేల లీటర్ల ట్యాంకు అమర్చాలి. దానికి తగ్గ పంపు సెట్‌ అందుబాటులో ఉంచాలి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు