రూ. 100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు

18 Oct, 2018 15:13 IST|Sakshi
టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రమేష్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ రూ.74 కోట్ల నిధులను గుర్తించలేని లావాదేవీల ద్వారా దారిమళ్లించినట్టు, రూ.25 కోట్ల బిల్లులను ఐటీ అధికారులు అనుమానాస్పదమైనవిగా కనుగొన్నట్టు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కథనం పేర్కొంది. ఐటీ అధికారులు ఈనెల 12న హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో, కడపలో ఎంపీ రమేష్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన మీదట సీఎం రమేష్‌ డైరెక్టర్‌గా ఉన్న రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ పలు సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా నిధులను దారిమళ్లించేందుకు పలు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి.

గత ఆరేళ్లుగా రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ఎడ్కో (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. అయితే రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఎడ్కోతో జరిపిన కరస్పాండెన్స్‌లో రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ అకౌంటెంట్‌ సాయిబాబు ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించినట్టు గుర్తించారు. ఎడ్కో స్టాంప్‌, సీల్‌ ఆయన వద్ద ఉన్నట్టు గుర్తించడంతో నిధుల దారిమళ్లింపునకే దీన్ని వాడుకున్నట్టు తెలుస్తోందని నివేదిక పేర్కొంది.

ఇక రూ. 25 కోట్ల బిల్లులకు సంబంధించి కంపెనీ డైరెక్టర్‌ కానీ, అకౌంటెంట్‌ కానీ సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని తెలిపింది. స్టీల్‌ సరఫరాదారుల నుంచి రూ. 12.24 కోట్లు వసూలైనట్టు కంపెనీ చూపగా, నగదు లావాదేవీల్లో వివరణ లేదని పేర్కొంది. ఢిల్లీ సబ్‌కాంట్రాక్టర్‌ ఎన్‌కేజీ కన్‌స్ర్టక్షన్స్‌కు రూ 6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు చూపలేకపోయారని నివేదిక తెలిపింది.


వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు
బ్యాంకుల నుంచి రుణంగా పొందిన రూ. 2.97 కోట్లను కంపెనీకి చెందిన కొందరు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు ఐటీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఆక్‌ స్టీల్స్‌, బీఎస్‌కే సంస్థలచే స్టీల్‌ కొనుగోళ్లకు సంబంధించి రూ 25 కోట్ల బిల్లులను అనుమానాస్పదమైనవిగా గుర్తించిన ఐటీ శాఖ వీటిని పరిశీలిస్తోంది. ఇక రికార్డుల్లో చెల్లింపులుగా చూపిన రూ. 8.4 కోట్ల మొత్తానికి సరైన వివరణ ఇవ్వలేదని, రమేష్‌ నివాసం నుంచి రూ. 13 లక్షలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులపై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సీఎం రమేష్‌ను ప్రశ్నించగా, వీటిపై నన్ను అడగవద్దని, ఐటీ అధికారులనే అడగాలని బదులిచ్చారు.

టీడీపీ నేతల బుకాయింపు
రాజకీయ కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు నిర్వహించారని సీఎం రమేష్‌పై ఐటీ దాడుల సందర్భంగా టీడీపీ నానా హంగామా చేసింది. సీఎం రమేష్‌ సైతం తనపై రాజకీయ కక్షతోనే దాడులు చేపట్టారని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రిగా పార్లమెంటరీ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా ఐటీ శాఖకు రమేష్‌ ఇచ్చిన నోటీసుల ఫలితంగానే సోదాలు జరిగాయని కూడా టీడీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులకు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌ సైతం ఆరోపించారు. గతంలో సుజనా చౌదరి ప్రస్తుతం సీఎం రమేష్‌లపై ఐటీ దాడులే ఇందుకు సంకేతమని చినబాబు అప్పట్లో ఆరోపించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా