ఫస్ట్ ఎయిడ్ కిట్.. అడ్రస్ నిల్!

17 Apr, 2016 02:02 IST|Sakshi

జిల్లాలో అత్యధిక శాతం ఆర్టీసీ బస్సుల్లో ఖాళీగా బాక్సులు  కిట్‌ల జాడే లేదు
ప్రయాణికులకు తక్షణ వైద్యం లేనట్టే
జిల్లాలో అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి
కొత్త బస్సులకే కిట్లు పరిమితం
‘సాక్షి’ విజిట్‌లో వాస్తవాలు వెలుగులోకి

 

కోట్లు కుమ్మరించి బ్రాండ్ ఇమేజ్ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు సౌకర్యాల కల్పనను మాత్రం విస్మరిస్తోంది. అమరావతి రాజధానికి కొత్త బస్సుల మంజూరు, విజయవాడ బస్‌స్టేషన్‌లో ఆధునిక వసతుల పేరుతో సినిమా థియేటర్ల నిర్మాణం, ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, సీటింగ్ సౌకర్యాలు, ఏసీ లాంజ్‌ల నిర్మాణానికి కోట్లు కుమ్మరిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా బస్సుల్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు మాత్రం పట్టించుకోవటం లేదు. బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్లు భూతద్దం పెట్టి వెతికినా బస్సుల్లో కనిపించని పరిస్థితి నెలకొంది. జిల్లాలో దాదాపు 60 శాతం బస్సుల్లో ఈ పరిస్థితి నెలకొనటం ఆర్టీసీ పనితీరుకు నిదర్శనం. జిల్లాలో శనివారం సాక్షి విజిట్  నిర్వహించగా ఈ విషయం తేటతెల్లమైంది.

 

విజయవాడ : ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలో జిల్లాలో 14 బస్ డిపోలు, 36 బస్టాండ్లు ఉన్నాయి. రోజుకు రూ.5 కోట్లకు పైగా ఆదాయంతో ఆర్టీసీ బస్టాండ్లు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో మొత్తం 1349 బస్సులు ఉన్నాయి. వాటిలో 250 అద్దె ప్రాతిపదికన నడుస్తుండగా.. మిగిలినవి సొంత బస్సులు. వాటిలో 59 ఏసీ సర్వీసులు, 154 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఇవి కాకుండా నిత్యం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు, రాయలసీమకు, బెంగళూరుకు వెళ్లే బస్సులు అన్ని కలుపుకొని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిత్యం 3,200 వరకు బస్సులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ‘తెలుగు వెలుగు’ పాసింజర్ బస్సులు ఉన్నాయి. జిల్లాలో 5 నుంచి 10 శాతం గ్రామాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున 75 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో ఇవి నడుస్తున్నాయి. టిక్కెట్లపై సెస్ రూపంలో విజయవాడ రీజియన్‌కు ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది.

 
కిట్‌ల జాడేదీ?

జిల్లాలో 60 శాతం బస్సుల్లో కిట్‌ల జాడే కనిపించటం లేదు. ప్రస్తుతం జిల్లాలో 300 వరకు బస్సుల్లో మాత్రం బాక్సులు ఉన్నాయి. వాటిలోనూ ఈ ఏడాది సుమారు 270 బస్సుల్ని పలు దఫాలుగా కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏసీ బస్సుల్లో మాత్రమే కిట్లు అందుబాటులో ఉన్నాయి. బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో మాత్రమే ఈ విషయం పట్టించుకుంటున్న రవాణా శాఖ ఆ తర్వాత విస్మరిస్తోంది. నిర్వహణ చూడాల్సిన ఆర్టీసీ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్‌లను ఏర్పాటుచేసే బాక్సులు అలంకారప్రాయంగా మారాయి.

 
కిట్‌లో ఇవి ఉండాలి...

రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి బస్సులో ప్రథమ చికిత్స బాక్సులు ఉండాలి. అందులో ప్రథమ చికిత్సకు అవసరమైన కిట్‌లు ఏర్పాటుచేయాలి. కిట్‌లో దూది, టించర్, బ్యాండేజీలు, గాయాలైనప్పుడు కట్టే వూండ్ క్లాత్, చిన్నపాటి గాయాలకు సంబంధించిన ఆయింట్‌మెంట్‌లు ఉండాలి. అవన్నీ కాలం చెల్లని మందులై ఉండటం తప్పనిసరి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫస్ట్ ఎయిడ్ కిట్‌లోని మందుల్ని మార్చాలి. ఇది రవాణా శాఖ ప్రాథమిక నిబంధన.

 

భద్రత ఏదీ?
వేసవి తీవ్రత పెరిగింది. జిల్లాలో సగటున 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సమయంలో జిల్లాలోని అన్ని డిపోల్లో కలిపి సుమారు 350 సర్వీసులు నడుస్తున్నాయి. శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బస్సులో ప్రయాణిస్తున్న తిరుపతయ్య అనే వ్యక్తి వడదెబ్బ తగిలి బస్సులోనే మృతి చెందాడు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. మే నెలలో 48 డిగ్రీలకూ చేరవచ్చు. ఇలాంటి తరుణంలో కనీసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం కొద్దిపాటి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆవైపు ఆర్టీసీ సంస్థ దృష్టి సారించాలి.

మరిన్ని వార్తలు