నామినేటెడ్ పందేరం

14 Jun, 2014 00:03 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు : అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాజకీయ నిరుద్యోగం నుంచి విముక్తి కల్పించబోతున్నారు. వారికి యుద్ధ ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టులతో ఉద్యోగ భృతి  కల్పించనున్నారు.
 
 గురువారం విశాఖపట్నంలో జరిగిన తొలి మంత్రివర్గ భేటీలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారిని రాజీనామా చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. పదవుల నుంచి నేతలు వైదొలగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా రాజీనామా చేయకపోతే తప్పించేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేయడంతో కాంగ్రెస్ నేతల్లో అలజడి ప్రారంభమైతే, టీడీపీ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
 
 తమ అధినేత మారాడని, గతంలో వలే కాకుండా తమ గురించి ఆలోచిస్తున్నాడని కార్యకర్తలు, నాయకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. జిల్లాలోని ఎంత మంది ముఖ్య నేతలకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పదవులు వరిస్తాయో అని అంచనాలు వేసుకుంటూ ఊహల్లో విహరిస్తున్నారు. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలోని ముఖ్య నిర్ణయాల సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే ఆశావహులు నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
 
 ఉడాపైనే అందరి దృష్టి..
 క్యాబినెట్ హోదా కలిగిన వి.జి.టి.ఎం. ఉడా చైర్మన్ పదవిపైనే పార్టీలోని ముఖ్యనేతలు దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్ పార్టీ నేత వణుకూరి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఆ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావుతో సన్నిహిత సంబంధాలు కలిగిన వణుకూరి ఆయన ద్వారానే టీడీపీలో చేరి పదవిని నిలబెట్టుకునే యత్నాలు చేశారు. వణుకూరి టీడీపీలో చేరినా ఆ పదవి ఆయనకు ఉండే అవకాశాలు లేవని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ పదవి కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలుతుందంటున్నారు.

 భవిష్యత్‌ను ఊహించి ముందే టీడీపీలో చేరినా, ఆ పదవి నుంచి హిదాయత్‌ను తొలగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. వీటితోపాటు గుంటూరు మార్కెట్‌యార్డు, గ్రంథాలయ సంస్థ, మైనార్టీస్ కార్పొరేషన్ వంటి ప్రాధాన్యత కలిగిన పదవులతోపాటు మార్కెట్ యార్డు చైర్మన్‌లు, కమిటీ సభ్యులతోపాటు దాదాపు 300 వరకు నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయి పదవుల కోసం ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. రెండో విడతలోనూ జిల్లా శాసన సభ్యులకు మంత్రి పదవులు లభించే అవకాశాలు లేవని పార్టీలో వినపడుతుండటంతో కొందరు ఎమ్మెల్యేలు అవి దక్కినా చాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 మున్సిపల్, స్థానిక సంస్థల కౌన్సిల్ ఎన్నికల తరువాతే.: నామినేటెడ్ పోస్టుల భర్తీకి కనీసం మూడు నాలుగు నెలల సమయం పడుతుందని, రాష్ట్రంలో కొన్ని మున్సిపాల్టీలకు మిగిలిన ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తరువాతనే వీటిని భర్తీచేసే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే పదవులు రాని నాయకులు నిరుత్సాహంతో మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశాలు ఉండటంతో వాటి తరువాతనే పదవుల భర్తీ ఉంటుందని కొందరు చెబుతున్నారు.
 
 మన్నవా... ఇదేం పని!
 సార్వత్రిక ఎన్నికలు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఉన్నతాధికారులకు గురువారం టీడీపీ నేతలు తెలిపిన అభినందనలు ఆ పార్టీలో కలకలం రేపాయి. జిల్లాలో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నప్పటికీ.. వారందరూ లేకుండా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఇతర నాయకులు కలెక్టర్ సురేశ్‌కుమార్, రూరల్, అర్బన్ ఎస్పీలు సత్యనారాయణ, గోపీనాథ్‌లను కలిసి పుష్పగుచ్చాలు, దుశ్శాలువలతో సత్కరించడం పార్టీలో చర్చనీయాంశం అయింది. ఇదే విషయాన్ని మంత్రి పుల్లారావుకు ఫోన్ చేసి మన్నవ వ్యవహారం వివరించినట్టు తెలిసింది. సీనియర్లను విస్మరించడం ఎంత వరకు సమంజసమో మన్నవకు మీరే చెప్పాలని వారంతా వివరించినట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు