తొలి కేబినెట్‌ ప్రధాన అజెండా రైతులు, మహిళలు, ఉద్యోగులే..

9 Jun, 2019 04:43 IST|Sakshi

తిత్లీ, ఫోనీ తుపాను పరిహారం.. వ్యవసాయ సీజన్‌ ప్రారంభంపై చర్యలు

పంటలకు మద్దతు ధరలపైనా చర్చ

ఆశా వర్కర్ల వేతనాల పెంపునకు కేబినెట్‌ ఆమోదం

ఉద్యోగుల ఐఆర్‌.. సీపీఎస్‌ రద్దు.. రైతు భరోసాపై నిర్ణయం

హోంగార్డుల వేతనాలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపుపై కూడా..

రేపు ఉదయం 10.30 గంటలకు కేబినెట్‌

సాక్షి, అమరావతి : రైతులు, మహిళలు, ఉద్యోగులే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాకులోగల మంత్రివర్గ సమావేశం మందిరంలో సోమవారం ఉ.10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్‌ భేటీ జరగనుంది. ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలతో పాటు, ఆశా వర్కర్ల (మహిళలు) వేతనాల పెంపునకు ఆమోదం, ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం మంజూరుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. తిత్లీ, ఫోనీ తుపాను సందర్భంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఎంతవరకు అందిందీ, ఇంకా పరిహారం ఇవ్వాల్సి ఉందా అనే అంశంపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

అలాగే, రాష్ట్ర ఎంత సాయం కోరితే కేంద్రం నుంచి ఎంత సాయం వచ్చిందనే అంశాలను ఇందులో చర్చిస్తారు. అలాగే, వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యత, పంటకు మద్దతు ధర తదితర అంశాలపై కూడా కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. ఆశా వర్కర్ల వేతనాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడమే కాకుండా సంబంధిత ఫైలుపై శనివారం సచివాలయంలో తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. వీరు రాష్ట్రంలో 42వేల మంది ఉన్నారు. వేతనాలు పెంచడం ద్వారా వీరు ఏటా రూ.504 కోట్ల మేర ప్రయోజనం పొందనున్నారు. ఇందుకు కేబినెట్‌లో సోమవారం ఆమోదముద్ర వేయనున్నారు.

27శాతం ఐఆర్‌పై కూడా నిర్ణయం
ఇక ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మధ్యంతర భృతి 27 శాతం ఇచ్చేందుకు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,415 కోట్ల మేర అదనపు భారం పడనుందని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది.

►అలాగే, కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును (సీపీఎస్‌) రద్దు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు తొలి కేబినెట్‌లో ఈ అంశంపై కూడా చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించడంతో అప్పటి సీఎం చంద్రబాబు సీపీఎస్‌ రద్దు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి  మాజీ సీఎస్‌ టక్కర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేశారు. ఆ కమిటీ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. కేబినెట్‌ సమావేశంలో టక్కర్‌ కమిటీ నివేదికలో ఏ సిఫార్సులు చేసిందనే అంశాలపై చర్చించనున్నారు. ఏ రూపంలో సీపీఎస్‌ను రద్దుచేయాలి, ఇందుకు ఎవరి అనుమతైనా తీసుకోవాలనే అంశాలపై కేబినెట్‌లో చర్చించి ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది.

►ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విధానంతోపాటు..

►పెన్షన్లను రూ.2,250కు పెంపుదల.. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చెందిన సమస్యలపైన చర్చిస్తారు.

►అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హోంగార్డుల వేతానాల పెంపు దిశగా కేబినెట్‌లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీరికి తెలంగాణలో ఇస్తున్న వేతనాలు కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో 16,616 మంది హోంగార్డులున్నారు. వేతనాలు పెంపు ద్వారా వీరికి ప్రయోజనం కల్పించడానికి తొలి కేబినెట్‌లోనే సీఎం బీజం వేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

►ఇవేగాక.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు.. అక్టోబరు నుంచి రైతు భరోసా కింద అన్నదాతలకు చెల్లించనున్న రూ.12,500ల పైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

మరిన్ని వార్తలు