కరోనా కట్టడిపై అప్రమత్తం

16 Apr, 2020 08:48 IST|Sakshi
దాచేపల్లిలో శాంపిల్స్‌ సేకరిస్తున్న వైద్య సిబ్బంది

సెకండరీ కాంటాక్ట్‌ కేసుల నమోదు

జిల్లాలో మొత్తం కేసులు 122              

గుంటూరు నగరంలో 90 

జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది.  గుంటూరు నగరంతోపాటు, పలు ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం  అధికారులను అప్రమత్తం చేసింది. తాజాగా బుధవారం తాడేపల్లి, పెదకాకాని మండలం ఉప్పలపాడు, గుంటూరు నగరం, దాచేపల్లిలో కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు.

సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుందని ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ తీసుకోవాల్సిన చర్యలపై దిశ, నిర్దేశం చేస్తోంది. నగరంలో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రైమరీ కాంటాక్ట్‌ దశ నుంచి జిల్లాలో సెకండరీ కాంటాక్ట్‌ దశకు చేరుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. దీనికి తగ్గట్టుగా ప్రత్యేక దృష్టి సారించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తుంది.   

జిల్లాలో 122 కరోనా కేసులు నమోదు...  
జిల్లాలో బుధవారం రోజు తాజాగా నాలుగు కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 122కి చేరింది. గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో కొత్తగా ఓ పాజిటివ్‌ కేసు నమోదైంది. పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఓ టిఫిన్‌ సెంటర్‌ నడిపే వ్యాపారికి కరోనా సోకింది. దాచేపల్లిలో కరోనా పాజిటీవ్‌తో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాడేపల్లిలో కొత్తగా ఓ కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయింది. గుంటూరు నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 90కు చేరాయి. బుధవారం నమోదైన ఎనిమిది కేసుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గుంటూరులోని రామిరెడ్డితోట ఒకటి, ఆనందపేట రెండు, పాతగుంటూరు పార్కురోడ్డు ఒక కేసులు నమోదయ్యాయి.  

మెరుగైన వసతుల కల్పన కోసం...  
క్వారంటైన్‌ కేంద్రాల్లో మరింత మెరుగైన వసతులు కలి్పంచే దిశగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లా కోవిడ్‌ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌ నేతృత్వంలో జిల్లా కలెక్టర్‌ ఐ. శామ్యూల్‌ ఆనందకుమార్, జాయింట్‌ కలెక్టర్‌ దినే‹Ùకుమార్, జిల్లా అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్‌ ఎస్పీ విజయరావు, ట్రైనీ కలెక్టర్‌ మౌర్యనారపరెడ్డితోపాటు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో మంచి భోజనం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తేల్చారు. అక్షయ పాత్ర భోజనం కొంత మందికి రుచించకపోవడంతో దాని స్థానంలో మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీల ద్వారా అన్నం వండించి క్వారంటైన్‌ సెంటర్‌లకు పంపించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో రాపిడ్‌గా కరోనా టెస్ట్‌లు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.   

క్వారెంటైన్‌కు 20 మంది తరలింపు  
పెదకాకాని: మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన 20 మందిని క్వారెంటైన్‌కు తరలించారు. వారిలో హోటల్‌ నిర్వహించే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. సైకిల్‌షాపు వ్యక్తితో పాటు హోటల్‌ నిర్వాహకుడికి పాజిటివ్‌ రావడంతో పాటు క్యారెంటైన్‌కు వెళ్లిన వారిలో బార్బర్‌షాపు నిర్వాహకుడు,  రోజూ హోటల్‌కు వెళ్లేవారున్నారు.

తాడేపల్లిలో తొలి కేసు నమోదు 
తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్‌నగర్‌లో మొట్టమొదటగా కరోనా కేసు బుధవారం నమోదైంది. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో కోవైడ్‌–19 వైరస్‌ సోకిన వ్యక్తికి సంబంధించిన కాంటాక్టుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం ఉన్నతాధికారులు మంగళగిరి కమర్షియల్‌ టాక్సెస్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని చెప్పడంతో తాడేపల్లి తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి, కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి వెళ్లి ఆ మహిళా ఉద్యోగి నివసిస్తున్న అపార్టుమెంట్‌లో వ్యక్తులు బయటకు రావడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సిబ్బంది అపార్టుమెంట్‌లో పనిచేసే వాచ్‌మెన్‌ దగ్గర నుంచి ఇళ్లలో పనిచేసే వారిని కూడా విచారణ చేపట్టి పలువురిని క్వారెంటైన్‌ సెంటర్‌కు తరలించారు. అనంతరం అపార్టుమెంట్‌ని రెడ్‌జోన్‌గా ప్రకటించి ఎవరినీ ఆ ప్రాంతంలోకి వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.
 

మరిన్ని వార్తలు