బోణీ కొట్టలేదు

19 Mar, 2019 09:03 IST|Sakshi
ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

తొలిరోజు నామినేషన్లు నిల్‌

సాక్షి, ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో తొలిరోజైన సోమవారం జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచీ ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. ఉదయం ఒంగోలు పార్లమెంట్‌కు రిటర్నింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌ వినయ్‌చంద్, బాపట్ల పార్లమెంట్‌కు రిటర్నింగ్‌ అధికారి అయిన సంయుక్త కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి నోటిఫికేషన్లు జారీ చేశారు. నోటీసు బోర్డులో నోటిఫికేషన్‌ జారీ చేసినట్లుగా వివరాలు ఉంచారు. ఎన్నికల సంఘానికి సమాచారమిచ్చారు. అలాగే జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అన్ని కేంద్రాల్లో ఎన్నికల కంట్రోల్‌ రూంలను ప్రారంభించారు.

ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసి సమయం ముగిసేంత వరకు ఆర్వోలు ఉన్నారు. అయితే, జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. ఒంగోలు ప్రకాశం భవన్‌లో ప్రారంభించిన ప్రత్యేక కేంద్రం నుంచి నామినేషన్‌ ఫారాలను ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరిట, బాపట్ల నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్‌ ఫారాలను తీసుకెళ్లారు. కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ప్రారంభించారు. భారీగా ఆర్వో కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్వో కేంద్రానికి వంద మీటర్ల వద్ద చేసిన మార్కింగ్‌లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కెమేరాలతో పాటు ఆర్వోల వద్ద వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు