పదిలో ఫస్ట్

21 May, 2015 03:43 IST|Sakshi

రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా
484 మందికి 10కి 10 జీపీఏ
98.54 శాతం ఉత్తీర్ణత  బాలికలదే పైచేయి
సంబరాలు చేసుకున్న విద్యా శాఖాధికారులు

 
 సాక్షి ప్రతినిధి, కడప : పదవ తరగతి ఫలితాలల్లో వైఎస్సార్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 98.54 శాతం ఉత్తీర్ణులై తొలిసారిగా ఈ ఘనత సాధించారు. మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వచ్చిన జిల్లా.. ఈ ఏడాది రాష్ట్రానికి తలమానికంగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 35,366 మంది పరీక్షలకు హాజరవ్వగా 34,848 మంది ఉత్తీర్ణులయ్యారు. దాంతో 98.54 శాతంతో జిల్లా ప్రథమ స్థానానికి చేరుకుంది. బాలుర విభాగంలో 17399 మందికి గాను 17733 మంది ఉత్తీర్ణులై 98.54 శాతం ఫలితాలు సాధించారు.

బాలికల విభాగంలో 17,367 మందికి గాను 17,115 మంది ఉత్తీర్ణత సాధించి 98.55 శాతం ఫలితాలతో బాలుర కంటే ఒకమెట్టు పైన నిలిచారు.  జిల్లా యంత్రాంగం సమష్టి కృషి, విద్యార్థుల పట్టుదల కారణంగా గత సంవత్సరం సాధించిన రెండవ స్థానం నుంచి మరో మెట్టుపెకైక్కి ప్రథమ స్థానంలో నిలిచింది. మంచి ఫలితాలు సాధించడంతో విద్యా శాఖ అధికారులు,   ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.  

 ప్రథమ, చివరి స్థానాలు రాయలసీమలోనే...
 పదవ తరగతి ఫలితాలల్లో వైఎస్సార్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రథమ, చివర స్థానాలు రాయలసీమకే దక్కాయి. వైఎస్సార్ జిల్లా 98.54 శాతం సాధించగా, అనంతపురం జిల్లా 93.11 శాతం, కర్నూలు జిల్లా 90.97 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చిత్తూరు జిల్లా 71.29 శాతం ఫలితాలతో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. కాగా ఫలితాల కోసం ఇంటర్నెట్ కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ సైతం 100 శాతం ఫలితాలు సాధించి అటు క్రీడలు, ఇటు చదువులోనూ తిరుగులేదని చాటి చెప్పింది.

 484 మందికి 10కి 10 జీపీఏ
 జిల్లా విద్యార్థులు ఫలితాల్లో చరిత్ర ృసష్టించారు. ఏకంగా 484 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించి చరిత్ర ృసష్టించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం 10కి 10 పాయింట్లు సాధించి సత్తాచాటారు. 10 పాయింట్లు సాధించిన ప్రైవేట్ పాఠశాలల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. గత ఏడాది 87 మంది విద్యార్థులు మాత్రమే 10కి 10 పాయింట్లు సాధించారు. ఈమారు ఏకంగా 5 రెట్లు అధికంగా 484 మంది 10కి 10 పాయింట్లు సాధించడం విశేషం.

 18 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
 జూన్ 18 నుంచి జూలై 1వ తేదీ వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు జూన్ 2వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 4న ప్రధానోపాధ్యాయులు ఫీజును ట్రెజరీలో చెల్లించి 6న డీఈఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం జూన్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
 
 పరీక్షల విజయంలో డీఈఓ వెబ్‌సైట్ కీలకపాత్ర...
 పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ర్ట స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంలో కడప డీఈఓ.కాం వెబ్‌సైట్ ఎంతో కీలకపాత్ర పోషించిందని జిల్లా విద్యాశాఖాధికారి బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో పాటు నైట్‌విజన్, బడిబస తదితర అంశాలతో పాటు ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు, సిబ్బంది అందరి సమష్టి కృషితోనే విజయం సాధించామన్నారు. ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్, పాఠశాల విద్య డెరైక్టర్, కలెక్టర్ తదితర అధికారుల సూచనలతో నిపుణులతో తయారు చేసిన మెటీరియల్‌ను వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

ఇందులోనుంచే దాదాపు 80 శాతం మేర ప్రశ్నలు రావడంతో విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. ఈ వెబ్‌సైట్‌ను 3 నెలల్లో 60 వేల మంది  చూశారన్నారు. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 85 శాతం మేర ప్యాడ్స్, పెన్నులు, రబ్బర్లు, పెన్సిల్‌లు అందజేసినట్లు ఆయన తెలిపారు. స్థానికంగా ఎంఈఓలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇందుకు సహకరించాయని తెలిపారు.
 
 డీఈఓ కార్యాలయం వద్ద సంబరాలు
 పదోతరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల డీఈఓ కార్యాలయ సిబ్బంది కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు. ఒకిరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం డీఈఓ కార్యాలయ ఆవరణంలో కేక్ కట్‌చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖపై ప్రశంసల వర్షం కురిసింది.

మరిన్ని వార్తలు