చట్ట సభలకు.. తొలిసారి

24 May, 2019 09:22 IST|Sakshi

అమలాపురం: సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విదంగా తూర్పు ప్రజలు  తీర్పునిచ్చారు. సంచలన రాజకీయాలకు కేంద్రబిందువైన తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయధుందుబి మోగించింది.  అలాగే సంప్రదాయంగా వినూత్న తీర్పులతో ఆకట్టుకునే తూర్పు ఈసారి కూడా కొత్తవారికి అవకాశం కల్పించింది. తొలిసారి పోటీ పడినవారు, గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారు ఈసారి విజయం సాధించి తొలిసారిగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే పార్లమెంట్‌ సభ్యులుగా లోక్‌సభకు ఎన్నికైన నలుగురికి కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

జిల్లా నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనవారిలో రాజానగరం నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఒకరు. రాజా తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సిటింగ్‌ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. రంపచోడవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన నాగులాపల్లి ధనలక్ష్మి సైతం టీడీపీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై భారీ అధిక్యంతో విజేతగా నిలిచారు. అనపర్తి నుంచి పోటీ చేసిన డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఘన విజయం సాధించారు. జగ్గంపేట నియోజకవర్గానికి టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్‌ నాయకుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై  జ్యోతుల చంటిబాబు సంచలన విజయం సాధించారు.

ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ టీడీపీ నుంచి పోటీ చేసిన డీసీసీబీ చైర్మన్‌ వరపుల రాజాపై విజయం సాధించారు. అలాగే రామచంద్రపురం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన జెడ్పీ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణు టీడీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై సంచలన విజయం సాధించారు. కోనసీమ పరిధిలో పి.గన్నవరం నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా, తిరిగి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పోటీ చేసిన కొండేటి చిట్టిబాబు తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్‌ బాబుపై భారీ మెజార్టీలో విజయం సాధించారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ సమీప వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై విజయం సాధించి, తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. 


లోక్‌సభకూ కొత్తవారే
జిల్లాలో నాలుగు పార్లమెంట్‌ స్థానాల నుంచి పోటీ చేసి ఎన్నికైన వారు లోక్‌సభలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ నలుగురు వైఎస్సార్‌సీపీ వారే కావడం గమనార్హం. వీరిలో కాకినాడ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వంగా గీతా విశ్వనాథ్‌ గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఒకసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. రాజమహేంద్రవరం నుంచి పోటీ చేసిన మారాని భరత్, అమలాపురం నుంచి పోటీ చేసిన చింతా అనూరాధ, అరకు (రంపచోడవరం భాగంగా ఉంది) వైఎస్సార్‌ సీపీ తరఫున జి.మాధవికి ఇవే తొలి ఎన్నికలు. వీరిని గెలిపించడం ద్వారా తూర్పు ఓటర్లు మరోసారి తన విలక్షణతను 
చాటుకున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు