'రొయ్య'లసీమ

28 Jun, 2020 04:41 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లా చాపాడులో వందెకరాలకుపైగా విస్తీర్ణంలో చేపలు, రొయ్యల సాగు

వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌ తదితర దేశాలకూ ఎగుమతి

ఆక్వా బిల్లుతో మరింత మంది రైతుల నుంచి పెరిగిన ఆసక్తి

చేపలు, రొయ్యలు సాగుకు సన్నద్ధం 

ప్రొద్దుటూరు: రాళ్లురప్పలతో కరువు ప్రాంతాన్ని తలపించే రాయలసీమ.. నేడు రొయ్యలు, చేపలు వంటి మత్స్యసంపదతో కళకళలాడుతోంది. వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలమైతే చేపల చెరువులతో కోనసీమను తలపిస్తోంది. ఒక్క రైతుతో 30 ఎకరాల్లో మొదలైన సాగు క్రమంగా వందల ఎకరాలకు విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు సైతం ఇక్కడి రొయ్యలు, చేపలను ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత మంది రైతులు ఆక్వా సాగుకు ముందుకు వస్తున్నారు.  

భీమవరం టూ వైఎస్సార్‌ జిల్లా..
ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి రైతులతో రొయ్యలు, చేపల సాగు గురించి ఆరా తీశారు. అదే సమయంలో పోరుమామిళ్ల మండలం ఎరసాల గ్రామానికి చెందిన కల్లూరి భాస్కర్‌రెడ్డి భీమవరం ప్రాంతంలో చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నాడని తెలుసుకుని ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. మన ప్రాంతంలో వీటిని సాగు చేస్తే బాగుంటుందని, ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ మేరకు చాపాడు మండలంలోని అనంతపురం–కుచ్చుపాప గ్రామాల మధ్య తనతో పాటు తన బంధువులు, గ్రామస్తులకున్న భూములను భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే లీజుకు ఇప్పించారు.

ఆయన తొలుత 30 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగును ప్రారంభించి ప్రస్తుతం 100 ఎకరాలకు పైగా విస్తీర్ణానికి పెంచారు. రొయ్యల సాగును కూడా చేపట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రూప్‌చంద్, కట్ల, శీలావతి, మోస్, పండుగప్ప, సీతల్‌ రకాల చేపలను సాగు చేస్తున్నారు. కుందూనది పరీవాహక ప్రాంతలో ఈ భూములు ఉండగా నీటి లభ్యత కోసం మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆరు అడగుల మేర నీరు నింపి.. పలు చోట్ల చెరువులను తయారు చేశారు. దూర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోనవసరం లేకుండా ఈ ప్రాంతంలోని వారికే శిక్షణ ఇచ్చి నియమించుకున్నారు. ఇక్కడ 8 కిలోల వరకు చేపలు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు సీతల్‌ రకం చేపలను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేశారు. 

కడపలో చేపల చెరువులా!
కేవలం 9వ తరగతి చదువుకున్న భాస్కర్‌రెడ్డి సాగులో కొత్త మెళకువలను పాటించి అధిక ఉత్పత్తిని సాధిస్తున్నారు. తన కుమార్తెను గుజరాత్‌లో పీజీ ఫిషరీసైన్స్‌ చదివించారు. ఆమె డిగ్రీ, పీజీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఇటీవల మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఈ చేపల చెరువులను సందర్శించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి  చేపల చెరువుల సాగు విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు దృష్టికి తీసుకెళ్లారు. ‘కడపలో చేపల చెరువులా..’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు.

ఆక్వా బిల్లుతో సాగుకు ముందుకొస్తున్న రైతులు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధి, ఎగుమతులు తదితరాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా చేపలు, రొయ్యలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.  

చేపలు, రొయ్యల సాగుకు సహకారం అందిస్తున్నా..
నా స్వగ్రామం పరిధిలోని అనంతపురం గ్రామం వద్ద చేపలు, రొయ్యల సాగు విస్తీర్ణానికి సహకారం అందిస్తున్నాను. ఇక్కడ కుందూ నీరు వస్తేనే పంటలు పండే అవకాశముంది. లేని రోజుల్లో కౌలు కూడా రాని పరిస్థితిని చూశాం. ఈ కారణంతోనే చేపల చెరువులను సాగు చేయడం మంచిదని భావించా. ప్రస్తుతం రైతులకు మంచి కౌలు వస్తోంది. చెరువులను పరిశీలించి.. ఎగుమతులకు తగిన సహకారం అందించాలని కలెక్టర్‌ను కూడా కోరాను.     
– శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు.

ఆశాజనంగా ఉంది
భీమవరంలో పొందిన అనుభవంతో ఇక్కడ చేపలు, రొయ్యల చెరువులను సాగు చేస్తున్నా. ఇప్పటివరకు సాగు ఆశాజనకంగా ఉంది. అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందితే మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశముంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు ఆదివారం ఉదయం చేపలు విక్రయిస్తున్నా.   
 – కల్లూరి భాస్కర్‌రెడ్డి, రైతు

మరిన్ని వార్తలు