గంగపుత్రుల పంట పండింది

24 Aug, 2018 13:06 IST|Sakshi
ఉప్పుటేరులో చేపలు వేటాడుతున్న మత్స్యకారులు

వలలో భారీగా పడుతున్న జలపుష్పాలు

భారీవర్షాలకు డెల్టాలో మునిగిన చెరువులు

గట్లు తెగి కొల్లేరు, ఉప్పుటేరుల్లోకి చేరిన చేపలు

వేటలో దిగిన వందలాది మత్స్యకారులు

ఆకివీడు: ఉప్పుటేరులో చేపలు ఇబ్బడిముబ్బడిగా దొరుకుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొల్లేరు తీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వందలాది ఎకరాల చేపలు, రొయ్యల చెరువులు ఏకమైపోయాయి. చాలా చెరువులకు గండ్లు పడ్డాయి. కొన్ని చెరువుల గట్లపై రెండు మూడు అడుగుల ఎత్తున ఇంకా నీరు ప్రవహిస్తోంది. దీంతో చెరువుల్లోని చేపలు, రొయ్యలు వరదనీటికి కొట్టుకుపోతున్నాయి. ఆ నీరు కొల్లేరులోకి, అక్కడి నుంచి ఉప్పుటేరులోకి చేరుతోంది. నీటి ప్రవాహంతోపాటు చేపలు గుట్టలు గుట్టలుగా ఉప్పుటేరులోకి చొచ్చుకు వస్తున్నాయి. మత్స్యకారులు వల వేస్తే చాలు దండిగా చేపలు పడుతున్నాయి. దాంతో ఉప్పుటేరులో మత్స్యకారులు వందలాది పడవలు, దోనెలతో వలలు వేసి చేపల్ని పట్టుకుంటున్నారు. వంద గ్రాముల సైజు నుంచి కేజీ లోపు చేపలుఅధికంగా వలలకు చిక్కుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా కొట్టాడ, జంగంపాడు, పెదకొట్టాడ, పందిరిపల్లె గూడెం, దుంపగడప, సిద్ధాపురం, చినమిల్లిపాడు, పెదకాపవరం, గుమ్ములూరు, చినకాపవరం తదితర గ్రామాల నుంచి వందలాది మంది మత్స్యకారులు ఉప్పుటేరులో వేటాడుతున్నారు. రోజుకు వెయ్యి నుంచి రూ.3 వేల వరకూ విలువైన చేపల్ని వేటాడుతున్నట్లు కొందరు మత్స్యకారులు తెలిపారు.

కిలో చేపలు రూ.30
ఉప్పుటేరులో వేటాడిన చేపల్ని కిలో రూ.30 లకు విక్రయిస్తున్నారు. ఉప్పుటేరు గట్టు వద్దే కాటా ఏర్పాటుచేసి తూకం తూస్తున్నారు. కొందరు పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఆకివీడులోని లాంచీల రేవు వద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెట్‌లో మరికొంత లాభానికి వాటిని అమ్ముకుంటున్నారు.

ఉప్పుటేరు నిండా కొంగలు
చేపలు దండిగా లభిస్తున్నందున ఉప్పుటేరు నిండా కొంగలు వాలుతున్నాయి. మూడు రోజులుగా ఉప్పుటేరు పొడవునా కొంగలు బారులుతీరి కనువిందు చేస్తున్నాయి.

పదేళ్లకో పండుగ
పదేళ్లకో పండుగ అన్నట్లుగా ఉంది మత్స్యకారులకు. చేపలు పట్టి జీవించే మత్స్యకారులు రోజంతా వేటాడినా గతంలో వలకు అరకొరగా చేపలు దొరికేవి. ఇప్పుడు దండిగా దొరుకుతున్నందున వారికి పండుగగా ఉంది. వేటాడిన చేపలు అమ్ముకుంటే ప్రస్తుతం వారికి కాసిన్ని డబ్బులు కనపడుతున్నాయి.– గాడి సంధాని, మత్స్యకారుడు, దుంపగడప

మరిన్ని వార్తలు