చేపల చెరువుకూ రుణమాఫీ!

15 Dec, 2014 02:48 IST|Sakshi

గుడివాడ రూరల్ : రెండు విడతలుగా విడుదల చేసిన రుణమాఫీ జాబితాల్లో అనేకమంది రైతులు అన్ని ఆధారాలూ సమర్పించినా తమ పేర్లు కనిపించక ఆందోళనకు గురవుతుంటే.. గుడివాడ మండలం చౌటపల్లిలో చేపల చెరువుకు రుణమాఫీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గ్రామంలోని సర్వే నంబర్ 207/2లో 2.5 ఎకరాల  చేపల చెరువు సాగవుతోంది.
 
ఇది తనకు వారసత్వంగా వచ్చిందని గ్రామానికి చెందిన కొత్తపల్లి సూర్యనారాయణ అనే రైతు చేపలు సాగు చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న దళితులు ఈ చెరువును తమ పూర్వీకులు గేదెల కోసం, దుస్తులు ఉతికేందుకు కేటాయించారని కోర్టులో కేసు వేశారు. దీనిపై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో విచారణ చేసి రిపోర్టు పంపించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ లోపుగానే కేడీసీసీ బ్యాంకు సిబ్బంది దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా పంట రుణం కింద దాదాపు రూ.40 వేలు రుణమాఫీ చేసింది. ఈ మేరకు రుణమాఫీ విమోచన పత్రాన్ని సాగు చేస్తున్న రైతుకు సాధికార సదస్సులో అధికారులు అందజేశారు.
 
ఆగ్రహిస్తున్న రైతులు...
ప్రభుత్వం అన్ని పత్రాలూ సమర్పించిన రైతులకు మొండిచేయి చూపించి, నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువుకు ఎలా రుణమాఫీ వర్తింపజేశారని అధికారులను నిలదీసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గ్రామానికి చెందిన బొబ్బరపల్లి లక్ష్మీనారాయణ దీనిపై క్షేత్రస్థాయి విచారణ జరపాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో  కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు